450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు
Recommended Video

అమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు.
మొత్తం 450 ఎకరాల్లో బౌద్ధ స్థూపాకృతిలో లా సిటీని నిర్మించనున్నారు. హైకోర్టు భవన నిర్మాణ విశేషాలతో కూడిన గ్యాలరీని సీజేఐ పరిశీలించారు. హైకోర్టు భవన నిర్మాణంపై అధికారులు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. రూ.819 కోట్లతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మించనున్నారు.

న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండదని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలోకేసుల పెండింగ్ సమస్య ప్రధానమైనదని చెప్పారు. ఏడాదిలోపు పెండింగులో ఉన్న కేసులు 81వేలు ఉన్నాయని తెలిపారు. పదేళ్లగా పెండింగులో ఉన్న కేసులు 25 లక్షలు అన్నారు. కేసుల సత్వర పూర్తిలో కొన్ని అవాంతరాలు ఉన్నాయన్నారు. న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేస్తే సమస్యలు తగ్గుతాయన్నారు. కిందిస్థాయి కోర్టుల్లోనే 5వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. హైకోర్టు స్థాయిలో 392 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. న్యాయమూర్తుల కొరత వల్లే పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు.
హైకోర్టు భవన ప్రారంభోత్సవం గర్వించదగ్గ విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళఅల తర్వాత ఏపీ న్యాయపాలనకు అనువైన వాతావరణం అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్నట్లు చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న విభజన సమస్యలు ఎంత త్వరగా పరిష్కరిస్తే ఏపీ అభివృద్ధి అంత వేగంగా జరుగుతుందన్నారు. నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరిస్తే భూములు ఇస్తామన్నారు. న్యాయ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏపీలో కొత్త ఆవిష్కఱణలు న్యాయవ్యవస్థకు దోహదం చేస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిరహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. 2022 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందన్నారు.
హైకోర్టు ప్రారంభోత్సవానికి సీజే రావడం సంతోషకరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు భవనానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. న్యాయవ్యవస్థకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థ పైన ఉందని చెప్పారు. రెండు వేల ఏళ్ల క్రితమే అమరావతి రాజధానిగా వెలుగొందిందని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో ఇక్కడి ప్రజలంతా భాగస్వాములే అన్నారు.












Click it and Unblock the Notifications