చుక్కలు చూపిస్తున్న పవర్ కట్స్! మండుటెండల్లో అప్రకటిత కోతలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి వేడికి తోడు విద్యుత్ కోతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయ్. ఏప్రిల్ మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండగా, విద్యుత్ శాఖ 'మరమ్మత్తుల' పేరుతో వేళాపాలా లేని కోతలకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గంటల తరబడి కరెంటు పోతుండటంతో ఉక్కపోతకు తాళలేక వృద్ధులు, చిన్నపిల్లలు విలవిలలాడుతున్నారు.
సాధారణంగా విద్యుత్ లైన్ల నిర్వహణ లేదా మరమ్మత్తులు ఉంటే శనివారం నాడు ముందుగానే పత్రికా ప్రకటన ద్వారా సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ప్రస్తుతం ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. అధికారులను అడిగితే 'మెయింటెనెన్స్' అని సమాధానం ఇస్తున్నారు. "చలికాలంలో తీరికగా ఉన్నప్పుడు చేయని రిపేర్లు.. మండు వేసవిలో, ఎండలు మండిపోతున్నప్పుడే గుర్తొచ్చాయా?" అని సామాన్యులు నిలదీస్తున్నారు.

చుక్కలు చూపిస్తున్న ఉక్కపోత!
పగటిపూట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో గంట పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయినా ఇళ్లు సెగలు గక్కుతున్నాయి. రాత్రిపూట కూడా అప్రకటిత కోతలు విధిస్తుండటంతో ప్రజలకు నిద్ర కరువవుతోంది. ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లలో కూడా బ్యాటరీ ఛార్జింగ్ కానంతగా కోతలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పట్టించుకోని కార్యాలయాలు..
విద్యుత్ కోతలపై ఫిర్యాదు చేద్దామని సబ్-స్టేషన్లకో లేదా ఏఈ కార్యాలయాలకో ఫోన్ చేస్తే అధికారుల నుంచి స్పందన కరువైంది. పదేపదే ఫోన్ చేసినా ఎవరూ ఎత్తకపోవడం, ఎత్తినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉందో లేక కావాలనే చేస్తున్నారో అర్థం కాక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందికీ తప్పని తిప్పలు..
మరోవైపు, మండుటెండలో విద్యుత్ స్తంభాలు ఎక్కి రిపేర్లు చేయాల్సి రావడంపై కిందిస్థాయి సిబ్బంది కూడా లోలోన మదనపడుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా వేసవిలో పనులు కేటాయించడం వల్ల అటు సిబ్బంది ప్రాణాలకు ముప్పు రావడమే కాకుండా, ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ అప్రకటిత విద్యుత్ కోతలకు చరమగీతం పాడాలని, ప్రజలకు ఈ వేసవి గండం నుంచి ఉపశమనం కలిగించాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications