మండుతున్న ఎండల్లో ఏపీకి చల్లటి వార్త
వేసవి కాలాన్ని మించిన ఎండలతో ఏపీలో భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. జులై నెలలో సాధారణ వర్షపాతం నమోదవడంతోపాటు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే అడపా దడపా చినుకులు రాలుతున్నప్పటికీ ఎండలు మాత్రం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రెండు వారాలు గడిచిపోవడంతో సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనపడటంలేదు.
సాధారణ వర్షాలు
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు గుంటూరు, కర్నూలు, ఏలూరు, మన్యం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

అన్నదాతలకు మేలవుతున్న వానలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం గద్వాల, నారాయణపేట, జోగులాంబ, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజా వానలు మేలు చేస్తాయని భావిస్తున్నారు. పొలాల్లో విత్తనాలు వేసేందుకు చినుకులు అవసరంకాగా సాధారణ వర్షాలు కురిస్తే పంటలు సాగుచేసేందుకు అన్నదాతలు ఉద్యుక్తులవుతున్నారు. వాణిజ్య పంటలకు వర్షాలు అవసరం కావడంతో ఏపీ, తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లోని రైతులు నెలరోజులుగా రాలే చినుకు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications