‘ఏపి కొత్త రాజధాని కోసం రూ. లక్ష కోట్లు కావాలి’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త రాజధాని నిర్మాణం కోసం రూ. 1,00,213ను ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని ఏపి ప్రభుత్వం కోరింది.
కేంద్రంతోపాటు కేంద్ర ప్రణాళిక సంఘం, 14వ ఆర్థిక సంఘాలకు రాజధానిపై నివేదికను ఏపి ప్రభుత్వం అందజేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ నిర్మించే ఈ కొత్త రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఈ నివేదికలో ఏపి ప్రభుత్వం పేర్కొంది.
‘మా ముందున్న మొదటి కర్తవ్యం రాజధానిని వేగంగా నిర్మించడం. హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించడం కొంత ఇబ్బందికరంగా ఉంది. మా రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించుకుని అక్కడి నుంచే పాలనను కొనసాగిస్తాం. కొత్త రాజధాని వల్ల పరిపాలన సులభతరం అవుతుంది. అందుకోసమే రాజధానిని వేగంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం' అని ఏపి తెలిపింది.

‘గత 60ఏళ్లుగా హైదరాబాద్, దాని చుట్టూ ప్రాంతాల అభివృద్ధిపైనే దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. కోస్తా, రాయలసీమలకు అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయి' అని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రాజధాని ప్రాంతాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. గుంటూరు ఆటోనగర్ నుంచి తూర్పు దిక్కున వై జంక్షన్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 10.5 కి.మీ రోడ్డు వరకు, దక్షిణాన బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, పశ్చిమాన బోరుపాలెం వయా అనంతవరం 75 కిలోమీటర్ల వరకు, ఉత్తరాన ఆటోనగర్ నుంచి వై జంక్షన్ 16 కిలో మీటర్ల మేర రాజధానికి సరిహద్దులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications