మంత్రులు రాజీనామాలు పిఎంకు ఇవ్వలేదు: అశోక్
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర సీమాంధ్ర మంత్రులు చేసిన రాజీనామాలు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇవ్వలేదని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు. కేంద్ర మంత్రుల తీరుపట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారా, లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నోట్ ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్ర విడిపోదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజనకు సుదీర్ఘ ప్రక్రియ సాగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని అశోక్ బాబు అన్నారు. అత్యవసర సర్వీసులు కూడా సమ్మెలోకి వస్తాయని చెప్పారు. కేంద్ర నిర్ణయం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిస్తే నాయకులకు రాజకీయ సమాధి తప్పదని ఆయన హెచ్చరించారు. విశాఖపట్నంలో కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.

స్వార్థ రాజకీయ క్రీడలో ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ఒంటరి చేసిందని, వారిని లెక్క చేసే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ప్రతి శాసనసభ్యుడి వద్ద ప్రమాణం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 6వ తేదీన తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పారు.
అంతా అయిపోయింది, ఏం చేయాలనే నిరుత్సాహం కూడదని ఆయన సమైక్యాంధ్ర ఆందోళనకారులకు సూచించారు. రాష్ట్ర విభజన చట్టరూపం ధరించాలంటే చాలా ప్రక్రియలు ఉంటాయని, కొన్ని ప్రక్రియల్లో కేంద్రానికి ఆటంకాలు తప్పవని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల్లో కొన్ని ఉద్యమంలోకి వచ్చినా ఆ పార్టీలతో ఉద్యోగులు కలిసి పనిచేయవద్దని, తాము రాజకీయాలకు అతీతంగానే ఉద్యమాన్ని నడిపిస్తామని అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు కూడా నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రాష్ట్ర విభజన ప్రక్రియపై ప్రభావం చూపించవచ్చునని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందదనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications