భిన్నస్వరాలు: బాబు ప్లాన్, అమరావతిని వాడుకుంటున్నారా!?
హైదరాబాద్: తుళ్లూరు ప్రాంతంలో నిర్మించనున్న రాష్ట్ర నూతన రాజధానికి అమరావతిగా ప్రభుత్వం పేరు ఖరారు చేస్తారనే అంశంపై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిని చాలామంది స్వాగతిస్తున్నారు. అమరావతి పేరు పెట్టాలనుకోవటం హర్షణీయమని, క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అమరావతి వైభవోపేతంగా అలరారిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు.
అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎదుట జాతిపిత మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేయాలన్నారు.
ఏపీ రాజధానికి అమరావతి పేరు పెడతారనే అంశంపై ప్రవాసాంధ్రులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి ఏ పేరు పెట్టినా ప్రజలకు ఒరిగేదేం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. ప్రధానంగా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
రాజధానిగా అమరావతి పేరు ఖరారవుతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో ప్రజలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందకెళ్తోందా? అని అనుమానిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలోని తుళ్లూరు మండలాన్ని రాజధాని కేంద్రంగా ప్రకటించి భూసమీకరణ చట్టం ద్వారా 33వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన విషయం తెలిసిందే. చాలామంది రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారు. కొన్నిచోట్ల రైతులు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం అక్కడ కూడా భూమిని సేకరించింది.
ఇప్పటికీ తాడేపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో రైతులు బలవంతంగా భూములు లాక్కోవద్దంటూ ఉద్యమిస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లడమే కాకుండా రాజధానికి నామకరణం కూడా పూర్తి చేసేందుకు సిద్ధమౌతోంది. జూన్ నెలలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనన చేసే అవకాశాలున్నాయి.
చంద్రబాబు మొదట రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు కావాలన్నారు. విమర్శల నేపథ్యంలో 30వేల ఎకరాలకు పరిమితమయ్యారు. అయితే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రైతుల పట్ట్భాములు, ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములు కలిపితే 47 వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
29 గ్రామాల్లో 54వేల ఎకరాలున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ప్రభుత్వ లక్ష్యం పూర్తవుతుందనేదా..? అనే లెక్కలు కూడా వేస్తున్నారు.
ఆ కోణంలోనే ప్రభుత్వం అమరావతి పేరును రాజధానిగా ప్రకటిస్తోందా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయని అంటున్నారు. రాజధానికి అమరావతి పేరును వాడుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు, కేంద్రం అమరావతిని వారసత్వ నగరంగా ప్రకటించినందున, రాజధానిలో కలుపుకునే అవకాశం ఉండకపోవచ్చనే వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications