జోగి బ్రదర్స్ కు మరో షాక్..! 10 రోజుల కస్టడీకి ఎక్సైజ్ శాఖ..!
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కు వరుస షాకులు తప్పడం లేదు. కల్తీ మద్యం వ్యవహారాన్ని తానే కనిపెట్టానంటూ నిన్న మొన్నటివరకూ చెప్పుకున్న జోగి రమేశ్ కు ఇప్పుడు ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇప్పటికే జోగి రమేశ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు తొలుత విజయవాడ జైలుకు, అనంతరం నెల్లూరు జైలుకు పంపారు. అంతలోనే ఎక్సైజ్ శాఖ జోగి రమేశ్ కు ఇవాళ మరో షాకిచ్చింది.
కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు రాము కూడా అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ కల్తీ మద్యం కేసులో తదుపరి విచారణ చేసేందుకు వీలుగా 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదుల్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇస్తూ రేపటికి విచారణ వాయిదా వేసింది.

రేపు ఎక్సైజ్ శాఖ పిటిషన్ పై జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు రాము ఇచ్చే స్పందన ఆధారంగా కోర్టు వీరి కస్టడీపై నిర్ణయం తీసుకోనుంది. ఇందులో వీరిని కస్టడీకి అనుమతిస్తే మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు కల్తీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు ఓ విడత కస్టడీకి తీసుకుని విచారించిన అద్దేపల్లి బ్రదర్స్ ను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ మాత్రం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన ఇంటికి సమీపంలో కల్తీ మద్యం తయారు చేస్తుంటే తానే సమాచారం ఇచ్చి పట్టించినట్లు జోగి రమేశ్ చెప్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో జోగి బ్రదర్స్ పాత్ర ఉందని అభియోగాలు నమోదు చేసింది. దీనిపై ఇప్పటికే జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు జోగి రమేశ్ కుటుంబంతో కలిసి విజయవాడ దుర్గ గుడిలో కల్తీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని ప్రమాణం కూడా చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు.












Click it and Unblock the Notifications