వైజాగ్‌లో లండన్ ఐ - వరల్డ్ టాప్–10 మెగావీల్స్‌లో ఒకటిగా :నగరం -సముద్రం వ్యూతో ..!!
విశాఖ నగర అందాల్లో మరో మరో అద్భుతం కనువిందు చేయనుంది. విశాఖపట్నంలో 'లండన్ ఐ' తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను బీచ్ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగావీల్ ప్రపంచ మెగావీల్ టాప్-10లో ఒకటిగా నిలిచిపోనుంది. సముద్రం..కొండ గాలుల మధ్య విశాఖ అందాలను 360 డిగ్రీల కోణంలో 125 మీటర్ల ఎత్తు నుంచి చూస్తూ.. రాత్రి డిన్నర్ చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం త్వరలో రానుంది.

విశాఖకు కొత్త అందాలు తెచ్చే క్రమంలో
లండన్ ఐ. ఇది ఒక మిలీనియం వీల్. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులోనున్న జెయింట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో సముద్రం ఒడ్డున వైజాగ్ అందాలను ఒకేసారి వీక్షించేందుకు అనుగుణంగా మెగావీల్‌ను నిర్మించనున్నారు.
అంతేకాదు రాత్రి సమయంలో అటు సముద్రం.. ఇటు నగర అందాలను వీక్షిస్తూ 125 మీటర్ల ఎత్తులో భోజనం కూడా చేసే ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ మెగావీల్ నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీచ్ రోడ్డులో 4 ప్రదేశాలను పర్యాటకశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

రూ 250 కోట్లతో ఐ వీల్ ఏర్పాటు
భీమిలి వైపు వెళ్లే బీచ్‌రోడ్డుకు ఇటువైపుగా రూ. 250 కోట్ల మేర వ్యయంతో ఈ మెగావీల్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 10 మంది చొప్పున ఒకేసారి 440 మంది ప్రయాణించే వీలుంటుంది. 15 ఎకరాల్లో ఈ మెగావీల్‌తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్, ఇతర రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం గ్లాసుతో నిర్మించనున్న కేబిన్ల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే వీలు కలగనుంది. అంతేకాకుండా 125 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కేబిన్ ఫ్లోరింగ్ కూడా గ్లాసుతో నిర్మించనుండడంతో కిందకు కూడా చూసే వీలుంటుంది. కేబిన్‌లో పూర్తిస్థాయి ఏసీ సదుపాయం. వైఫై, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు.
Recommended Video

ఏ పరిస్థితి అయినా తట్టుకొనే విధంగా
ఆటోమేటిక్ ఫొటోగ్రఫీ సదుపాయం ఉంటుంది. తుపాన్లతోపాటు 8.3 భూకంప తీవ్రతస్థాయిని తట్టుకునేలా వీల్ నిర్మాణం జరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందని చెబుతున్నారు. వీల్ మొత్తం ఒకసారి రొటేషన్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు 1,320 మంది పర్యాటకులు ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. విశాఖను పూర్తి స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి కి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. అందులో భాగంగానే..త్వరలో లండ్ ఐ అందుబాబులోకి తెస్తామి వెల్లడించారు.












Click it and Unblock the Notifications