పులివెందులలో మరో వివేకా తరహా హత్య కుట్ర ? అవినాష్ పై సునీత సంచలనం..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హంతకుల్ని పట్టుకోవడంలో సీబీఐ దారుణంగా విఫలమైంది. కొందరు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపినా వారు కూడా బెయిల్ పై బయటకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ రద్ద చేయాలంటూ సుప్రీంకోర్టును వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కడప ఎస్పీని సునీతారెడ్డి దంపతులు కలిశారు.
అనంతరం మాట్లాడిన సునీతారెడ్డి.. పులివెందులలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య తరహాలోనే మరో హత్యకు నిందితులు కుట్ర చేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సునీత ఆరోపణలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా తమ వర్గానికి చెందిన సురేశ్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

పులివెందులలో తాజా పరిణామాలు చూస్తుంటే తన తండ్రి హత్యే గుర్తుకువస్తోందని సునీత ఆరోపించారు. అప్పట్లో గొడ్డలిపోటుతో వివేకా చనిపోతే గుండెపోటు అని చెప్పారని గుర్తుచేశారు. అప్పట్లో క్రైమ్ సీన్ తుడిచేయడంతో పాటు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవే నిందితులంటూ సంతకాలు చేయమన్నారని, కానీ తాము అందుకు అంగీకరించలేదని తెలిపారు.

ఇప్పుడు కూడా అలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సునీతారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాటం చేస్తున్నా ఇప్పటివరకూ దోషులకు శిక్ష పడలేదన్నారు. దీనికి తోడు వివేకాను తాను, తన భర్త కలిసి హత్య చేయించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పు చేసిన వారికి మాత్రం శిక్ష పడాల్సిందేనన్నారు. తాజా పరిణామాలపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సునీత వెల్లడించారు.












Click it and Unblock the Notifications