మేయర్ అనురాధ దంపతుల హత్య: చింటూకు సహకరించిన వ్యక్తి అరెస్టు
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కర్ణాటకలోని ములుబాగల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుంగనూరు వచ్చేందుకు చింటూకు సహకరించిన నాగరాజు అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
గత నెల 17వ తేదీన హత్య జరగగా 21వ తేదీ నుంచి చింటూ పుంగనూరులోనే తల దాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. చింటూకు ఓ ప్రముఖ నేత ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్నారు. పుంగనూరు ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు చింటూకు ఆశ్రయం కల్పించి, న్యాయవాదిని పరిచయం చేసినట్లు పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం.

అనురాధ దంపతుల హత్య తర్వాత వెంటనే చింటూ చెన్నై పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే, కర్ణాటకలోని ములబాగల్ నుంచి పుంగనూరు చేరుకుని, అక్కడి నుంచి చిత్తూరు వచ్చి న్యాయస్థానంలో అతను లొంగిపోయినట్లు భావిస్తున్నారు. దీన్ని బట్టి చింటూ కర్ణాటకకు పారిపోయినట్లు అర్థమవుతోంది. అయితే చెన్నై మీదుగా అతను కర్ణాటకకు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
పుంగనూరులో ఓ రాజకీయ నేత సమకూర్చిన ఆశ్రయం, పరిచయం చేసిన న్యాయవాది సహకారంతో చింటూ పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చిత్తూరు న్యాయస్థానంలో లొంగిపోయినట్లు భావిస్తున్నారు. వర్షం పడుతుండడం వల్ల ఆటోలో వచ్చి, గొడుగు అడ్డం పెట్టుకోవడంతో న్యాయస్థానంలోకి ప్రవేశించే వరకు చింటూను గుర్తించలేకపోయామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications