అనురాధ దంపతుల హత్య: చింటూ వెనక ఎవరున్నారు?
చిత్తూరు: చిత్తూరు మేయరు కటారి అనురాధ, కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేయర్ దంపతులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలు చింటూకు తెలియంది కాదని, అందువల్ల అతను ఎవరి సహకారమైనా తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మేయర్ దంతులను హత్య చేసిన తర్వాత ఎవరు తనను రక్షిస్తారు, ఎలా బయటపడాలనే విషయాలపై కూడా చింటూ ముందస్తు ఆలోచన చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. వెనక తాము ఉంటామని ఎవరైనా చింటూకు హామీ ఇచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే చింటూ న్యాయమూర్తి ముందు లొంగిపోయాడని కూడా అనుకుంటున్నారు.

చింటూ ఎవరి సాయం కోరాడు, ఎవరి అతనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంత వరకు ఎవరు సహకరించారనే విషయాలపై పోలీసులు కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ దంపతులను హత్య చేయడంలో కుటుంబ కారణాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ రాజకీయ కోణం కూడా ఉందనే భావన నెలకొని ఉంది.
మేయర్ దంపతుల హత్యకు చింటూ ఆరు నెలల ముందే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో హత్య జరగడాన్ని ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణిస్తోంది.












Click it and Unblock the Notifications