ఏపీలో మరో సమ్మె విరమణ- పండగ వేళ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన తర్వాత ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఉద్యోగుల వరుస సమ్మెలు చికాకు పెడుతున్నాయి. అంగన్ వాడీలు సమ్మె ప్రారంభించాక వారి వెంట పారిశుద్ధ కార్మికులు, ఆ తర్వాత 104, 108 సిబ్బంది ఇలా పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. దీంతో వీరితో చర్చలు జరిపేందుకే ప్రభుత్వాధినేతలు కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులతో జరుపుతున్న చర్చల్లో పురోగతి లభించడంతో ఇవాళ మరో సమ్మె విరమణ అవుతోంది.
రాష్ట్రంలో తాజాగా సమ్మె బాట పట్టిన 104, 108 ఉద్యోగులతో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ చర్చలు జరిపారు. గుంటూరులోని ఆమె నివాసంలోనే జరిపిన చర్చల్లో వారి డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఆర్ధిక స్ధితితో పాటు అన్ని వివరాలు వారికి వివరించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నట్లు వారికి తెలిపారు. దీంతో వారు సమ్మె విరమణకు అంగీకరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్చాలనే వినతి తమ ముందుకు వచ్చిందని, దీనిపై సీఎం జగన్ తో చర్చిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీనిపై ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించామన్నారు.ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ విధానం వెంటనే అమలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెల్లో ప్రభుత్వం జరిపిన చర్చలతో మున్సిపల్ ఉద్యోగులు ఇప్పటికే సమ్మె విరమించారు. ఇప్పుడు 104, 108 వాహనాల ఉద్యోగులు కూడా సమ్మె విరమించడంతో ప్రభుత్వానికి పండుగ వేళ ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో విపక్షాలు కూడా వీరి సమ్మెల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తరుణంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్చలు జరిపి ఉద్యోగుల్ని దారికి తెస్తోంది.













Click it and Unblock the Notifications