గోదావరికి మళ్లీ వరద: తెలుగు రాష్ట్రాలు హైఅలర్ట్
అమరావతి: గోదావరి మళ్లీ వరద తాకిడికి గురైంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రవాహ ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం రాత్రి నాటికి 47 అడుగులకు చేరింది. వరద నీటి ప్రవాహం మరింత అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీని ప్రభావం ఏపీలో ధవళేశ్వరం బ్యారేజీపై పడుతోంది. ఇన్‌ఫ్లో భారగా పెరిగింది.
గోదావరికి వరదపోటు సంభవించడం ఈ సీజన్‌లో ఇది నాలుగోసారి. ఇదివరకు భద్రాచలం వద్ద 71 అడుగులకు పైగా నీటిమట్టం చేరిన విషయం తెలిసిందే. పరివాహక ప్రాంతాల ప్రజలు, విలీన-లంక గ్రామాలు నీట మునిగాయి. వేలాదిమందిని ప్రభుత్వం సహాయ, పునరావాస ప్రాంతాలకు తరలించింది. అప్పట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా ఆయా జిల్లాల్లో పర్యటించారు.

ఆ తీవ్రత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మళ్లీ వరద ఉధృతి పెరిగింది. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉప నదులు పోటెత్తుతున్నాయి. కాళేశ్వరం వద్ద 18.45 అడుగుల నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి భద్రాచలానికి 10.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో ఇక్కడి నీటిమట్టం 47 అడుగులకు చేరింది.
ఏపీలో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉంటోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి నాటికి 10 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇన్‌ఫ్లో క్రమంగా పెరగడంతో బ్యారేజీ నుంచి 7.48 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరిగింది. అప్పర్ స్పిల్‌వే వద్ద 23.71 మీటర్లు, లోయర్ స్పిల్‌వే వద్ద 21.25 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
పోలవరం గేట్లను ఎత్తేయడం వల్ల వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం బ్యారేజీ నిండుకుండలా మారింది. మరో రెండు రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగుతుందని అంచనా వేస్తోన్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తోన్నారు. వరద తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన వర రామచంద్రాపురం, కూనవరం, చింతూరు, ఎటపాకల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వీఆర్ పురం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications