జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా 'సీనియర్ల' రాజకీయాలు
జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఏపీ, తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ తో భేటీ అయిన తర్వాత ఈరోజు వరకు ఎన్టీఆర్ పేరు వినపడుతూనే ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో కలిశాం అని రాసుకొచ్చారు. రాజకీయ ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ బయట మాత్రం రాజకీయంగా ఎంత రగడ జరగాలో అంత జరుగుతూనే ఉంది. భారతీయ జనతాపార్టీ జూనియర్‌ను తమవాడుగా ప్రచారం చేసుకుంటోంది. వైసీపీ తరఫున రంగంలోకి దిగిన కొడాలి నాని టీడీపీని జూనియర్ స్వాధీనం చేసుకుంటారని చెబుతున్నారు. తెలుగుదేశం మాత్రం గుంభనంగా ఉంటోంది. ఇదీ ప్రస్తుత పరిస్థితి.

రాజకీయాలకు చర్చకు రాకుండా ఎలా ఉంటాయి?
అమిత్ షాతో ఎన్టీఆర్ కలిసినప్పుడు రాజకీయాలు చర్చించకుండా ఎలా ఉంటారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తాజాగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షా, జూనియర్ భేటీపై కొనసాగుతున్న ఆసక్తిని అలాగే కొనసాగనిద్దామన్నారు. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్‌ను విస్తృతంగా వాడుకుంటున్నారు. పార్టీలన్నీ తమకు తోచినరీతిలో భాష్యం చెబుతున్నాయి. అసలు ఏం చర్చించామన్నది షాకు, జూనియర్‌కు మాత్రమే తెలుసు. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకొని బీజేపీ పొత్తుతో పోటీచేస్తారని, ఆ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని జూనియర్‌కు సన్నిహితుడైన కొడాలి నాని జ్యోతిష్యం చెబుతున్నారు.

బీజేపీ సానుభూతిపరుడిగా ముద్ర?
అమిత్ షాతో భేటీ అయినందుకు ఆయన బీజేపీ సానుభూతిపరుడని కొందరు విశ్లేషిస్తున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి మాత్రం ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుతో సంబంధాలు దెబ్బతిన్నతర్వాత కొడాలి నాని బహిరంగంగా జూనియర్ ను కలిసిన దాఖలాలు లేవు. కానీ రెండురోజులపాటు ఆయన ఒకటే అంశాన్ని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకుంటారని. అందుకు బీజేపీ సహకరిస్తుందా? అన్న విలేకరుల ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పడంలేదు.

రాజకీయాలకు దూరమయ్యారు
2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో స్థిరంగా ఉండిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఎవరు ఎన్నిరకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ వాటికి సమాధానం మాత్రం ఇవ్వడంలేదు. తన ఊపిరి ఉన్నంతవరకు టీడీపీలోనేనని గతంలోనే ఎన్నోసార్లు చెప్పారు.కూకట్ పల్లిలో సోదరి సుహాసిని పోటీచేసినప్పుడు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితమయ్యారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కూడా స్పందించారుకానీ ఎక్కడా రాజకీయ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారు. సినిమాల్లో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రసక్తే ఉండదని, ఇవన్నీ కేవలం రాజకీయ ఊహాగానాలేనని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications