వాగ్వాదం, రోజాకు గాయాలు: కోర్టుకు వెళ్తామని జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసన సభను రోజా సస్పెన్షన్ అంశం కుదిపేసింది. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేయగా, పునరాలోచన లేదని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, రోజాను అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ సమయంలో రోజా సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఆమెను డిశ్చార్జ్ చేశారు. అంతకుముందు జగన్ ఆమెను ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రోజాపై సస్పెన్షన్ సరికాదన్నారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభ జరగనీయబోమని సభలో వైసిపి చెప్పింది. అయితే, సస్పెన్షన్ పైన పునరాలోచన లేదని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ
శాసనసభ నుంచి వైసిపి సభ్యురాలు రోజా ఏడాది సస్పెన్షన్‌పై పునరాలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం శనివారం సభలో స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకోవాలని లేకుంటే సభా కార్యక్రమాలను జరగనీయబోమని అంతకుముందు వైసిపి చెప్పింది.

ఏపీ అసెంబ్లీ
రోజా సస్పెన్షన్ అంశంపైనే శాసనసభలో అధికార, ప్రతిపక్షం మధ్య గందరగోళం నెలకొనడంతో శనివారమూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగలేదు. వైసిపి సభ్యుల నినాదాల మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది.

ఏపీ అసెంబ్లీ
తొలుత సభ కొలువుదీరిన వెంటనే బిజెపి సభ్యులు విష్ణు కుమార్ రాజు కాల్ మనీపై మాట్లాడేందుకు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసును సభాపతి కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ.. తీవ్రమైన అంశంపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరగా శుక్రవారం ఎక్కువసేపు చర్చ జరిగిందని స్పీకర్ చెప్పారు.

ఏపీ అసెంబ్లీ
ఇది ముగిసిన వెంటనే రోజా సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకోవాలని విపక్ష నేత జగన్ పట్టుబట్టారు. వైసిపి సభ్యులు పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా మళ్లీ వైసిపి సభ్యులు యథావిధిగానే వ్యవహరించారు. చివరికి సభలో బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం 15 నిమిషాలు టీ విరామం కోసం కేటాయిస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ
విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక.. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నీరు - ప్రగతిగపై ప్రకటన చేసి.. సంబంధిత వివరాలు చదువుతుండగా.. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆ గందరగోళం నడుమే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ
రోజా పైన ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. సస్పెన్షన్‌ను ఈ సమావేశాల వరకు మాత్రమే వర్తింపచేస్తే బాగుంటుందన్నారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమేలేదన్నారు. విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల్ని యనమల ఖండించారు.

ఏపీ అసెంబ్లీ
వైసిపి శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అసెంబ్లీ మార్షల్స్, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

ఏపీ అసెంబ్లీ
రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయించే అంశంపై చర్చించేందుకు శనివారం సభ ప్రారంభానికి ముందు జగన్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

ఏపీ అసెంబ్లీ
ఈ సమావేశంలో పాల్గొనేందుకు రోజా రావడంతో సస్పెండ్ అయిన సభ్యులు లోపలికి రావడానికి అనుమతి లేదంటూ మార్షల్స్ అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని బయటకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఏపీ అసెంబ్లీ
దీంతో వైసిపి నేతలు, రోజా ప్రతిఘటించారు. వారికి, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో కిందపడిపోయిన రోజాకు గాయాలయ్యాయి.

ఏపీ అసెంబ్లీ
తర్వాత పోలీసులు ఆమెను పోలీస్ వాహనంలో నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసి అసెంబ్లీ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జగన్ అక్కడ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ
అనారోగ్యంతో ఉన్న ఆమెను పోలీసు వాహనంలో ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుతారా? అంటూ మండిపడ్డారు. ఒక స్థాయిలో పోలీసు వాహనం కదలకుండా జగన్ కాన్వాయ్ వాహనం అడ్డు నిలవడంతో పోలీసులు అంబులెన్స్‌ను తెప్పించి అందులో రోజాను నిమ్స్‌కు తరలించారు.

ఏపీ అసెంబ్లీ
తర్వాత అసెంబ్లీకి వెళ్లిన జగన్, అసెంబ్లీ వాయిదా పడ్డాక నిమ్స్‌కు వెళ్లి రోజాను పరామర్శించారు. రోజా సస్పెన్షన్‌పై కోర్టుకు వెళతామని జగన్ విలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications