CJP protest: సీజేపీ మార్చ్ తో దిల్లీ అస్తవ్యస్థం.. సోనమ్ వాంగ్ చుక్ కలవనున్న నడ్డా..!
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన సంసద్ చలో ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్లమెంట్ వైపునకు దూసుకొస్తున్న క్రమంలో పార్లమెంట్ మూసివేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దారంతా సీజేపీ కార్యకర్తలు, పోలీసులతో నిండిపోయింది. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. లాఠీ ఛార్జ్, రబ్బర్ బులెట్స్ ప్రయోగించారు.
అయినా వెనక్కు తగ్గకుండా సీజేపీ కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. బారికేడ్లను తోసుకుని పార్లమెంట్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏం జరుగుతుందోనని దిల్లీ ప్రజలు టెన్షన్ లో ఉన్నారు.
మరోవైపు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సీజేపీ ఆందోళనల మధ్య వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 3 గంటలుగా ఈ భేటీ కొనసాగుతోంది. వీరితోపాటు కిరణ్ రిజిజు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక సీజేపీ మార్చ్ కారణంగా దిల్లీ వ్యాప్తంగా మెట్రో రైళ్లు బంద్ అయ్యాయి.
అటు సంసద్ చలో మార్చ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి దింపుల్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పలువురు సమాజ్ వాదీ పార్టీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఇక ఇప్పటికే సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, మరో నేత అశుతోష్ రాంక్కా తమ డిమాండ్ల లేఖను జేపీ నడ్డాకు సమర్పించారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్రధాన్ ను తొలగించాలని కోరుతూ సీజేపీ నేతలు లేఖలో పేర్కొన్నారు. అలాగే సోనమ్ వాంగ్ చుక్ ను తక్షణమే రిలీజ్ చేయాలి.. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి. అని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ను నడ్డా కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications