నా కేసు సంగతేంటి ? సీతారామాంజనేయులు అరెస్టుపై రఘురామ ప్రశ్న..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ ఇంటెలిజన్స్ ఛీఫ్, ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయుల్ని పోలీసులు అరెస్టు సంచలనంగా మారింది. ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీతారామాంజనేయుల్ని పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయుల్ని అరెస్టు చేయకుండా వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ ఇవాళ చోటు చేసుకున్న పరిణామం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు స్పందిస్తున్నారు.
ఇదే క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఉదయం 9 గంటలకు టీవీల్లో ఓ శుభవార్త విన్నానని రఘురామ తెలిపారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పీసీబీ అధికారిగా, ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా అనైతిక కార్యక్రమాల్లో జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తిగా సార్ధక నామథేయుడిగా పీఎస్సార్ ఉన్నారని రఘురామ తెలిపారు. ముందుగా తనపై దాడి, ఆ తర్వాత జత్వానీ కేసుల్లో పీఎస్సార్ కీలకంగా ఉన్నారన్నారు.

తనపై దాడి చేసిన కేసులో పీఎస్సార్ ఏ2గా ఉన్నారని, పీఎస్సార్ వ్యహకర్త అని, పీవీ సునీల్ కుడా వెధవ పనులు చేయడంలో ముందుంటాడన్నారు. వీరిద్దరూ తనపై దాడికి వ్యూహరచన చేశారన్నారు ఇప్పుడు జత్వానీ కేసులో సీతారామాంజనేయుల్ని అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసినప్పుడు రఘురామ కేసులోనూ ఆయన ఏ2గా ఉన్నారని అంతా చెప్తున్నారన్నారు. పీఎస్సార్ అరెస్టు తర్వాత చాలా మంది తనకు ఫోన్ చేసి మీ కేసు ఎంతవరకూ వచ్చిందని అడుగుతున్నారని రఘురామ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పై నా స్పందన... pic.twitter.com/7gQp53TA3E
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) April 22, 2025
పీఎస్సార్ ఆంజనేయుల అరెస్టు తరహాలోనే తన కేసులో మరో ఐపీఎస్ పీవీ సునీల్ ను కూడా అరెస్టు చేస్తారా అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఆయన్ను కనీసం విచారణకు పిలవలేదన్నారు. దెబ్బలు తిన్న తనలాంటి వాడు కనీసం మారుతీ 800 కారు వేగంతో విచారణ జరుగుతుందని ఆశిస్తారన్నారు. కానీ రోడ్డు రోలర్ గా ఈ విచారణ సాగుతోందన్నారు. ఓసారి విచారణ వేగం పుంజుకుంటే ఇక ఆగదని తాను నమ్ముతూ వస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు తనపై సుమోటో కేసు పెట్టిన సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్ నుంచి రానంటున్నాడని రఘురామ తెలిపారు. సీతారామాంజనేయుల్ని ఎలా అరెస్టు చేశారో అదే బాటలో తన కేసు కూడా వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు రఘురామ తెలిపారు. తన కేసు రిపోర్టులు తారుమారు చేసిన డాక్టర్ ను ఇప్పటికే విచారిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications