రేపు ఉండిలో ప్రతీకార దినోత్సవం-రఘురామ షాకింగ్ నిర్ణయం..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రేపు ఓ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో రఘురామరాజు చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
రేపు తన ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహించాలని రఘురామ నిర్ణయించారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు పెట్టారని, తనపై కేసు పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రఘురామ తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వంలో వీడియోలో మతాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారన్న కారణంతో రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామను అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. సీఐడీ కస్టడీలో రఘురామపై దాడి కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆ తర్వాత జైలు నుంచి రఘురామ విడుదలయ్యారు. అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ ఉండేవారు. తద్వారా టీడీపీకి దగ్గరైన ఆయన.. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు.
అయితే తనపై రాజద్రోహం కేసు పెట్టి హింసించినా ఆ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘురామరాజు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ కేసులో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచేందుకే ఇలా ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో ఈ వ్యవహారంపై చర్చ జరిగేలా చేయాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications