రాజధానిపై రగడ: ప్రకటనకు ముందే చర్చకు జగన్ పట్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బుధవారం ఆంధ్రప్రదేశ్ శానససభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజధాని ఎక్కడ అనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటనకు ముందే శాసనసభలో చర్చించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టబడుతూ శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు గురువారం రాజధాని ఎక్కడ అనే విషయంపై ప్రకటన చేస్తారని చెప్పిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటనకు ముందే శాసనసభలో చర్చించాలని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పట్టుబట్టారు. ఈ స్థితిలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. గతంలో చర్చ చేసి, ఓటింగ్ జరిగిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకున్న సంప్రదాయం ఉందని జగన్ గుర్తు చేశారు.

రాజధాని విషయంలో ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తే తాము సహించబోమని ఆయన అన్నారు. ప్రకటనకు ముందే రాజధాని అంశంపై చర్చ జరగాలని, ఆ తర్వాత ఓటింగ్ జరగాలని, అదంతా జరిగిన తర్వాత ప్రభుత్వం రాజధానిపై ప్రకటన చేయాలని ఆయన అన్నారు. రాజధానిపై చర్చకు ఎంత సమయం కేటాయిస్తారని ఆయన అడిగారు.
సభా నిబంధనలు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెంనాయుడు విరుచుకుపడ్డారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత శాసనసభలో చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోకుండా రాజధానిపై చర్చ జరగాలని అనడం సరి కాదని టిడిపి సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి ఏం చెబుతారో విన్న తర్వాతనే చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎంతగా నచ్చజెప్పినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వినలేదు. ప్రకటనకు ముందైనా, తర్వాతనైనా చర్చ ఉండవచ్చునని, రెండు పద్ధతులూ సాధ్యమేనని స్పీకర్ అన్నారు. ప్రకటన చేసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వీలుందని, ఎందుకు తొందరపడుతున్నారని ఆయన వైసిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications