వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ సిఫార్సు-ప్రభుత్వానికి కీలక సూచన..!
ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. అనంతరం రావడమే మానేశారు. ఆ తర్వాత ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాకుండా దూరంగానే ఉండిపోతున్నారు. అనర్హత వేటు వేస్తామని, మీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రభుత్వం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి తన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు వారిని అసెంబ్లీకి రావాలని, వచ్చి చర్చల్లో పాల్గొనాలని, కోరినంత సమయం కూడా ఇస్తామని చెప్పినా వారు మాత్రం పట్టించుకోకపోవడంపై స్పీకర అయ్యన్న ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సభలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బహిరంగంగానే కోరారు.

ఉద్యోగస్థులు డ్యూటీకి వెళ్లకపోతే చర్యలు తీసుకుంటారు కదా, అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికీ వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా అని అయ్యన్నపాత్రుడు తెలిపారు. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా అని అడిగారు. ఎమ్మెల్యేల డ్యూటీ ఏంటి ? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు.

అసెంబ్లీకి వచ్చి మాట్లాడనప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరిచ్చారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకుని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచించారు. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లికి రాకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉప ఎన్నిక వస్తుందని హెచ్చరికలు చేశారు. ఇప్పుడు అయ్యన్న ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications