Rushikonda: రుషికొండను ఎలా వాడుకుందాం? నేడు అసెంబ్లీలో తేల్చనున్న సర్కార్..!
ఏపీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రుషికొండ నిర్మాణాలపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఇందులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండను తొలిచి ఈ నిర్మాణాలను ఎలా చేపట్టారు, ఎంత ఖర్చుపెట్టారు, అందులో విలాలవంతమైన సామాగ్రి, వాటిని భవిష్యత్తులో ఎలా వాడుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చించబోతోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకశాఖ విశాఖలోని రుషికొండను తొలిచి భారీ భవనాలను నిర్మించింది. ఇందుకోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. రుషికొండపై చేపట్టిన ఈ నిర్మాణాలు పర్యాటక శాఖ అవసరాలకు అని చెప్పి అప్పటి సీఎం జగన్ కోసం నిర్మించారన్న ప్రచారం ఉంది. అయితే అంతలోనే ఎన్నికలు రావడంతో రుషికొండ భవనాలను ఏమీ చేయలేని పరిస్దితుల్లో వైసీపీ సర్కార్ వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయింది.

దీంతో అప్పటివరకూ రుషికొండ భవనాలపై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు వరుసగా దీన్ని సందర్శించడం మొదలుపెట్టారు. చివరిగా సీఎం చంద్రబాబు రుషికొండకు వెళ్లి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. ఈ భవనాలను ఏం చేయాలో తెలియడం లేదని చంద్రబాబు చెప్పేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ భవనాలను ఎలా వాడుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీనికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీలో రుషికొండపై చర్చ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో సభ్యులు ఇచ్చే సూచనల ఆధారంగా ప్రభుత్వం రుషికొండపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications