టీడీపీ ఎమ్మెల్యేల్ని తొలగించాల్సిందే- రాష్ట్రం దివాలా- నీరోలా జగన్ - బీజేపీ విష్ణు కామెంట్స్
ఏపీ-తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ కు వారు రాసిన లే్ఖ కూడా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ చేస్తున్న ప్రచారానికి వంత పాడేలా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయులు, గొట్టిపాటి రవి లేఖ రాశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అస్థిత్వాన్ని దెబ్బతిసే విధంగా తెలంగాణ వ్యవహరిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు తక్షణం వారిని పార్టి నుండి తొలగించాలని విష్ణు డిమాండ్ చేశారు.
తెలంగాణ అభ్యంతరాలపై కేంద్రానికి లేఖ రాసి ఏపీ సీఎం జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారని విష్ణు ఆరోపించారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వద్ద ఏపీ నేతలు చేతులెత్తేశారని విమర్శించారు. ఏపి జల వనరులపై ప్రజా ఉద్యమం చేస్తామన్నారు. కేఆర్ఎంబి సమావేశానికి రాకుండా తెలంగాణ పారిపోయిందని, అసలు ఏపీలో జలవనరుల శాఖ ఉందా లేదా అని విష్ణు ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ రోమ్ నగరం తగులబడుతుంటే రాజు ఫిడేలు వాయించినట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ విష్ణు ఆరోపించారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ను ప్రాజెక్ట్ దగ్గరకు అనుమతించకపోతే ప్రభుత్వం ఏంచేస్తోందని అడిగారు.
ప్రజల సొమ్మును తీసుకొని ప్రజలకే పంచుతున్నారని, ఏపీ అభివృద్ధిపై శ్వేతపత్రం ప్రకటించాలని విష్ణు డిమాండ్ చేశారు. ఏపి దివాళా తీసిందని, అప్పులిచ్చేవారు లేరన్నారు. .బ్యాంకులు ఏపికి అప్పు ఇవ్వటం లేదని విష్ణు ఆరోపించారు. .జీతాలివ్వలేని స్థాయిలో ప్రభుత్వం ఉందన్నారు.కులాల మధ్య కుంపటి పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ ను ఉద్దేశించి విష్ణువ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications