హైకమాండ్ తో ఏపీ బీజేపీ నేతల సింకింగ్ ? చంద్రబాబు హ్యాపీ-వైసీపీ గుర్రు !
ఏపీలో బీజేపీ నేతలపై తరచుగా ఓ వ్యాఖ్య వినిపిస్తుంటుంది. అది పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు, మైండ్ గేమ్ ల ఆధారంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తుంటారని. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారుతున్నాయి. కేంద్రంలో కీలక నేతలు తరచుగా రాష్ట్రంలో పర్యటనలుచేయడం, స్ధానిక పరిస్దితులపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవడం వల్లో కానీ ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు అధిష్టానం మనసు తెలుసుకుని వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీల అధినేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

అధిష్టానంతో ఏపీ బీజేపీ
ఏపీలో దశాబ్దాల క్రితమే రాజకీయాలు మొదలుపెట్టిన బీజేపీ ఇప్పటికీ సొంతగా అధికారంలోకి రావడం మాట అటుంచి కనీస ఉనికి చాటుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో బీజేపీని గతంలో నడిపించిన నేతలే అనే విమర్శ ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అధిష్టానం అనుకునే దానికీ, రాష్ట్రంలో బీజేపీ నేతల వ్యవహార శైలికీ అస్సలు పొంతన ఉండదనే వాదన కూడా ఉంది.
అంతెందుకు గతేడాది అమిత్ షా తిరుపతి రాక ముందు అమరావతి రాజధానిని అస్సలు పట్టించుకోని బీజేపీ నేతలు.. ఆ తర్వాత మాత్రం ఏకంగా పాదయాత్రలోనే పాల్గొన్నారు. అప్పటి నుంచి కేంద్రంలో పెద్దలు చేస్తున్న ఫాలో అప్ కారణంగా ఇక్కడి నేతలు కూడా రూటుమార్చుకుంటున్నారు.

అధిష్టానం బాటలోకి ఏపీ బీజేపీ
తాజాగా ఏపీలో మారుతున్న పరిస్ధితులు, తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ పెడుతున్న ఫోకస్ పంటి కారణాలతో ఏపీ బీజేపీ నేతలు కూడా రూటుమారుస్తున్నారు. గతంలో అధిష్టానం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఇక్కడ రాజకీయాలు నడిపిన నేతలు కాస్తా ఇప్పుడు అధిష్టానం చెప్పినట్లు వింటున్నారు. అంతే కాదు అధిష్టానం మనసెరిగి ప్రవర్తిస్తున్నారు. అధిష్టానం భవిష్యత్ వ్యూహాలకు తగినట్లుగా తామూ నడుచుకుంటున్నారు. అలా చేయకపోతే అధిష్టానం ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని భయపడుతున్నారు కూడా. దీంతో ఏపీ బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ఏపీ బీజేపీలో అనూహ్య మార్పు
ఏపీ బీజేపీ నేతలు 2019లో టీడీపీ తమపై పోరాటం చేసి దారుణంగా ఓటమిపాలైన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ రెండు పార్టీలకు తాము వ్యతిరేకమనే వాదన తీసుకొచ్చేవారు. అంతే కాదు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ జగన్ సర్కార్ ను రాష్ట్రంలో తీవ్రంగా టార్గెట్ చేసేవారు.
అక్కడితో ఆగకుండా చంద్రబాబు బీజేపీ విషయంలో ఏ చిన్న సానుకూల వ్యాఖ్య చేసినా వెంటనే స్పందించి మళ్లీ ఆయనతో పొత్తుల్లేవంటూ విమర్శలకు దిగేవారు. చంద్రబాబు అవినీతి పరుడంతా, జగన్ సర్కార్ హిందువుల్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు చేసేవారు. కానీ తాజాగా మారిన పరిస్ధితుల్లో చంద్రబాబు గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అదే సమయంలో జగన్ సర్కార్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న వాదన తెరపైకి తెస్తున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తు గురించి ఇంత చర్చ జరుగుతున్నా దీనిపైనా ఎక్కువగా స్పందించడం లేదు.

చంద్రబాబు హ్యాపీ-జగన్ గుర్రు?
ఏపీ బీజేపీ నేతలు గతంలో చంద్రబాబు-జగన్ ఇద్దరికీ సమానదూరం పాటిస్తామని చెప్పేవారు. కానీ ఇప్పుడు రూటుమార్చి వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తుండటంతో టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ-బీజేపీ పొత్తుకు ఇదే నిదర్శనం అంటున్నారు.
ఇన్నాళ్లూ చంద్రబాబును దూరం పెట్టిన మోడీ-షా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం కలుపుకునేందుకు సిద్ధం కావడం సానుకూల పరిణామంగా చెప్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం టీడీపీ-బీజేపీ పొత్తు వార్తలపై బీజేపీ స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. గతంలోలా సమానదూరం వ్యాఖ్యలు చేయకుండా కేవలం తమనే టార్గెట్ చేయడం పట్ల బీజేపీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పుడు బహిరంగంగా బీజేపీని తప్పుబట్టే పరిస్ధితి లేకపోవడంతో మౌనంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications