AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- కొత్త అసెంబ్లీ, హైకోర్టు సహా ఇవే..!
ఏపీలో ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అమరావతిలో త్వరలో చేపట్టబోయే పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ఇప్పటికే ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ నిర్ణయం ప్రకారం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. దీంతో పాటు మరికొన్ని నిర్ణయాలకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది.
ఇవాళ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో త్వరలో ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నారు. అలాగే కొత్తగా 617 కోట్ల ఖర్చుతో శాశ్వత అసెంబ్లీ, 786 కోట్ల ఖర్చుతో హైకోర్టు నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఈ రెండు నిర్మాణాలకు సమర్ధుడైన ఎల్ 1 కాంట్రాక్టర్ కు అప్పగించాలని నిర్ణయించారు. వీటితో పాటు సీఆర్డీయే అథారిటీ తీసుకున్న మొత్తం 46 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వాతావరణ పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఓ సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వరద నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు , చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు 6.35 ఎకరాల భూమి కేటాయించింది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూ మార్పిడికి ఆమోదం తెలిపింది. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్ కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించారు. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా తో పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటును కూడా ఆమోదించింది. తాజాగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చేసిన 30 వేల కోట్ల విలువైన 16 ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించింది.
మరోవైపు రాష్ట్రంలో తాజా పరిణామాలపై కేబినెట్ లో మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. వీటిలో టీటీడీ గోశాలలో గోవుల మృత్యువాత, వక్ఫ్ చట్టం ఆమోదంపై నిరసనలు, పాస్టర్ ప్రవీణ్ మృతిపై చర్చించారు. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టేప్రచారాలు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ఆరోపణలను మంత్రులు దీటుగా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రులు వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications