ఏపీ రాజధానిపై తేల్చేసిన కేంద్రం - రాష్ట్రానిదే నిర్ణయం : అమరావతే ఇక..!!
ఏపీ రాజధాని ఏది. ఇప్పుడు ఏపీ వాసులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. అయితే, దీని పైన కేంద్రం తేల్చి చెప్పేసింది. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం.. బిల్లుల ఉప సంహరణ..సమగ్రంగా బిల్లులు మరోసారి ప్రవేశ పెడతామని ప్రభుత్వ ప్రకటన.. అమరావతి రైతలు ఆందోళన...న్యాయస్థానంలో కేసుల నడమ కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై సభ్యులు సంధించిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు.

పార్లమెంట్ లో కేంద్రం క్లారిటీ
దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏదిగా భావించాలి.. ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చి చెప్పింది. "మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు.

ఇప్పటికైతే అమరావతే రాజధాని
ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే" అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. దీంతో..అమరావతి రాజధానిగా ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక, మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం చెప్పిన విధంగా మరోసారి ప్రతిపాదిస్తే.. ఆ తరువాత చోటు చేసుకొనే పరిణామాలు..నిర్ణయాలకు అనుగుణంగా రాజధాని మారే అవకాశం ఉంటుంది.
Recommended Video

హైకోర్టులో విచారణ.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఇప్పటికైతే అమరావతి రాజధానిగా కొనసాగుతున్నట్లుగా కేంద్రం తేల్చి చెప్పింది. ఇక, హైకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ..రాజధాని రైతుల పిటీషన్ల పైన విచారణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులను ఉప సంహరించినా.. మరోసారి ప్రవేశ పెడతామని చెప్పిన విషయాన్ని కోర్టులో రాజధాని రైతులు ప్రస్తావించారు. అయితే, తాము చట్టాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వ లేమని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో.. ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు రాజధాని విషయంలో కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications