నారా లోకేష్ కు సీఐడీ ఇచ్చిన నోటీసుల్లోని అంశాలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో నారా లోకేష్ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగోతేదీ ఉదయం పదిగంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కేసులో లోకేష్ ను ఏ-14గా పేర్కొన్నారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్ కు సీఐడీ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులిచ్చారు.
120(B), 409,420, 34,35,36,37, 166, 167, 217 ఐపీసీ, 13(2),13(1)(c)&(D) సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో 10 కీలక అంశాలను లోకేష్‌కు సీఐడీ అధికారులు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, ఎవిడెన్స్ ను ట్యాంపరింగ్ చేయకూడదని, ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులను ప్రలోభపెట్టటం గానీ, బెదిరింపులకు గురి చేయటం గానీ చేయకూడదన్నారు. అవసరమైనప్పుడు కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు హాజరవ్వాలని, విచారణలో నిజనిజాలను తెలపాలన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలను, భూముల లావాదేవీల విషయంలో బోర్డు మీటింగ్స్‌కు సంబంధించిన మినిట్స్ బుక్‌ను, భూముల కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్ వివరాలను ఇవ్వాలన్నారు. కేసుతో సంబంధం ఉన్న దోషులను అరెస్ట్ చేసేందుకు పూర్తిగా సహకరించాలని, విచారణ కొనసాగినన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఏ ఆధారాన్ని ధ్వంసం చేయకూడదని, విచారణలో విచారణాధికారి పెట్టే కండిషన్స్ ను అనుసరించాలన్నారు. నోటీసులకు అణుగుణంగా విచారణకు హాజరుకానప్పుడు, సహకరించనప్పుడు సీఆర్పీసీ 41A(3) & (4) సెక్షన్ ప్రకారం అరెస్ట్ తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications