Margadarsi : మార్గదర్శి విచారణ పేరుతో వేధింపులు-ఏపీ సీఐడీ వివరణ ఇదే..!
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఏ1 అయిన ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావుతో పాటు ఏ2గా ఉన్న మార్గదర్శి చిట్స్ ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ తాజాగా ప్రశ్నించింది. అయితే విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ వీరు చేస్తున్న ఆరోపణలపై ఇవాళ సీఐడీ అధికారులు విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మార్గదర్శి కేసు విచారణపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు.
మార్గదర్శి విషయంలో సీఐడీ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. మార్గదర్శి విషయంలో చట్టబద్ధంగానే విచారణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటికెళ్లి వేధింపులకు గురి చేస్తున్నాం అనేది అవాస్తవమన్నారు. మార్గదర్శి కేసులో నిన్న ఎండీ శైలజా కిరణ్ విచారణకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

విచారణ సమయంలో శైలజా కిరణ్ కు అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఐడీ అదనపు ఎస్పీ తెలిపారు. విచారణ నిజాయితీగా పారదర్శకంగా చేస్తున్నామన్నారు. సీఐడీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న విచారణకు వెళ్ళినప్పుడు అధికారులను అడ్డుకున్నారని, మార్గదర్శి ఎండీ శైలజ నిన్నటి విచారణలో 25 శాతం మాత్రమే సమాధానం చెప్పారని అదనపు ఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా సీఐడీ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
మార్గదర్శి కేసు విచారణలో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేకుండా చూస్తున్నామన్నారు. అలాగే వారికి అనారోగ్యమని చెబితే అవసరమైన ట్యాబ్లెట్లు అందించి, భోజనం వంటి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.












Click it and Unblock the Notifications