సీఐడీ అదుపులో జగన్ హయాం నాటి కీలక అధికారి ? మూడ్రోజుల క్రితమే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం తయారీ, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని సీఐడీ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మద్యం వ్యవహారాల్లో కీలకంగా ఉన్న వాసుదేవరెడ్డిని ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో ఈసీ తప్పించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై ఆధారాల ధ్వంసం కేసులు పెట్టింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తాజాగా హైదరాబాద్ లో వాసుదేవరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఐపీఎస్ ఘట్టమనేని శ్రీనివాస్ తో పాటు మరికొందరు సీఐడీ అధికారులు ఆయన్ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నిర్బంధంలో వాసుదేవ రెడ్డిని తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని వాసుదేవరెడ్డిపై సీఐడీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, దీంతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని వారు చెప్తున్నారు. న్యాయం కోసం హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించనున్నట్లు వాసుదేవ రెడ్డి కుటుంబం చెబుతోంది. అయితే వాసుదేవరెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడంతో ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
2008 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అదికారి అయిన వాసుదేవరెడ్డిని గతంలో వైసీపీ ప్రభుత్వం కీలకమైన ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా నియమించింది. ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వ పరం చేయడంతో పాటు మద్యంలో కొత్త బ్రాండ్లను తెచ్చింది ఈయన హయాంలోనే. దీంతో అప్పటి నుంచి కూటమి పార్టీలు ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి దస్త్రాల్ని మాయం చేసారన్న ఆరోపణలతో కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగాయి.












Click it and Unblock the Notifications