PV Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు..! మద్యం స్కాంలో బిగ్ వికెట్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్న రూ.3500 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో వైసీపీ కీలక ఎంపీ, పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సన్నిహితుడైన పీవీ మిథున్ రెడ్డిని ఇవాళ సీఐడీ సిట్ అధికారులు అరెస్టు చేసారు. నిన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పేసిన నేపథ్యంలో ఇవాళ విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని దాదాపు ఏడు గంటలు విచారించిన సిట్.. సాయంత్రం అరెస్టు చేసింది.
గత వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం విధానం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లు, వాటి తరలింపుల విషయంలోనూ ప్రధానంగా ఉన్నారని సిట్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాాలు చేస్తోంది. అయితే తొలుత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరిన మిథున్ రెడ్డికి నిరాశ తప్పలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

మద్యం స్కాం కేసులో ఏ4గా మిథున్ రెడ్డిని చేర్చిన సిట్ అధికారులు ఇవాళ ఆయన్ను ఉదయం నుంచి దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మిథున్ రెడ్డిని రాత్రికి లేదా రేపు ఉదయం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజే్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. దీంతో దాదాపుగా కీలక నిందితులందరినీ అరెస్టు చేసినట్లయింది.

మరోవైపు ఇవాళ సీఐడీ కోర్టులో మద్యం స్కాంపై 300 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు.. ఇందులో మిథున్ రెడ్డి పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటివరకూ ఆయన్ను అరెస్టు చేయకపోవడం, ఛార్జిషీట్ దాఖలుకు 90 రోజుల గడువు పూర్తి కావస్తుండటంతో ఈసారికి ఆయన పేరు ప్రస్తావించలేదు. అయితే 20 రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. అందులో కచ్చితంగా మిథున్ రెడ్డి పేరు చేర్చబోతున్నారు.












Click it and Unblock the Notifications