ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని సంకల్పించి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, విజయవాడ ఉత్సవ్, అరకు ఉత్సవ్ వంటి వేడుకలే కాదు, అన్ని విధాలా టూరిజం డెవలప్మెంట్ కు చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.
ఎకో మరియు టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలి: చంద్రబాబు
అటవీ దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో మరియు టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రాజెక్టులు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పర్యాటకులకు 10 వేల హోం స్టేలు
ఈ సమావేశంలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన సూచించారు. పర్యాటకులకు 10 వేల హోం స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.
తిరుపతి, విశాఖ అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్
విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. కారవాన్ల రిజిస్ట్రేషన్లు, కారవాన్ పార్కుల ఏర్పాటు అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ఆ ప్రాంతాలు
అయితే ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద మరో రూ.663 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటకశాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏపీలో పర్యాటక అభివృద్ధి చెందేలా గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరఘాట్‌తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications