ఎపి పై ఎందుకంత వివక్ష...భవిష్యత్తులో తీవ్రపరిణామాలు తప్పవు:కేంద్రానికి చంద్రబాబు వార్నింగ్
అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు.
తెలంగాణలో తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కింద రూ.450 కోట్లు విడుదల చేసిన కేంద్రం...ఎపిలో ఏడు జిల్లాలకు అదే పథకం కింద ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను మాత్రం వెనక్కి తీసేసుకుంది...మనం మోడీతో విభేదించగానే మన ఖాతాల్లో వేసిన ఆ సొమ్మును వెనక్కి గుంజేసుకున్నారు. మన రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష?...ఇది రాజకీయ కక్ష కాదా?...మీకు అధికారం ఉందని అన్యాయం చేస్తే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నానంటూ
సిఎం చంద్రబాబు కేంద్రం తీరుపై మండిపడ్డారు.

మోడీ...కావాలనే చేస్తున్నారు...
బుధవారం అనంతపురం జిల్లా లో పర్యటించిన సిఎం చంద్రబాబు భైరవానితిప్ప జలాశయానికి జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తరలించే జీడిపల్లి-బీటీపీ-కుందుర్పి ఎత్తిపోతల పథకానికి బీటీపీ వద్ద శ్రీకారం చుట్టి, పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోడీ ఎపికి నమ్మకం ద్రోహం చేశారు. ప్రత్యేక హోదాను అమలు చేయలేదు. నాలుగేళ్లుగా ఎదురుచూసినా ఏ స్పందనా లేదు. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని గ్రహించి ఎన్డీయే సర్కారు నుంచి మంత్రులను రాజీనామా చేయించానని చంద్రబాబు చెప్పారు.

కేంద్రం...సమాధానం చెప్పాలి
కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఐటి దాడులు చేయిస్తున్నారని...19 ఐటీ టీమ్ లను రాష్ట్రానికి పంపించారని...ఇన్ని టీములతో ఏకకాలంలో అనేక చోట్ల దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయినా మీరు బెదిరిస్తే భయపడేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. అలాగే పీడీ అకౌంట్లలో అవినీతి జరిగిందని,యూసీలు ఇవ్వలేదని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అసలు మేము ఈ దేశంలో భాగస్వాములం కాదా?...అని చంద్రబాబు ప్రశ్నించారు. రాఫెల్ డీల్‌లో బోఫోర్స్ కంటే ఎక్కువ అవినీతి జరిగిందని...దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మోడీని చూస్తేనే...జగన్ కు వణుకు
రాష్ట్రంలో రెండు, మూడు పార్టీలు మోడీ చెప్పినట్లు ఆడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. "అవినీతి వైకాపా అధినేతకు మోడీని చూస్తేనే వణుకు. జైలు భయంతో అతను రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఆస్తులు కాపాడుకోవడమే అతని ధ్యేయం. అన్నీ ఇచ్చేస్తానంటూ ప్రజల ముందుకు వస్తున్నాడు. కొండకు ఓ వెంట్రుక కడుతున్నాడు. వస్తే కొండ వస్తుంది. లేకపోతే వెంట్రుక మాత్రమే పోతుందనేలా హామీలు ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. వైకాపా ఎంపీలు సకాలంలో రాజీనామాలను ఆమోదింపజేసుకొని, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీకి వెళితే వీళ్ల కథేంటో తేలిపోయేది"...అని చంద్రబాబు జగన్ పై ధ్వజమెత్తారు.

పవన్...మౌనం ఎందుకు?
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..."మరో నాయకుడు పవన్ కల్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ అని...రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.75వేల కోట్లు రావాల్సి ఉందని తేల్చాడు...మరి ఇప్పుడు వాటి గురించి ఎందుకు మౌనం పాటిస్తున్నాడు...వీళ్లకు రాష్ట్రం మీద ప్రేమ లేదు...టిడిపి గెలుపు చారిత్రక అవసరం...ఐదేళ్ల ఎన్నికల పరీక్షలో టిడిపికి ఏకపక్షంగా ఓటేసి ఆశీర్వదించండని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో టిఆర్ఎస్,ఇక్కడ జగన్, పవన్‌ను ఉపయోగించుకొని బిజెపి మనపై దాడి చేస్తోందని...అయినా మీ అండతో కొండనైనా ఢీకొంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!