కేంద్రం సాయం బాగాలేదు!: ప్లైట్ దిగి నేరుగా మోడీ వద్దకు బాబు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విమానం దిగి నేరుగా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.
చంద్రబాబు ప్రధాని మోడీ అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్డుకు అధికారులతో కలిసి చేరుకున్నారు. చంద్రబాబు వేరే పనేమీ పెట్టుకోకుండా నేరుగా ప్రధాని నివాసానికి చేరుకోవడం గమనార్హం. ఏపీలోని కరువు పరిస్థితుల పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.
ఇవీ బాబు విన్నపాలు..
ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహజ వనరులన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నట్లు చంద్రబాబు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కరువు నివారణ చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సాయం గురించి వివరించడంతోపాటు, రాష్ట్రంలో కరువు నివారణ చర్యల కోసం చేపట్టిన పనులను రాష్ట్ర సర్కారు విశదీకరించనుంది. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం గురించి సీఎం ప్రధానికి వివరించనున్నారు.
ఆ ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తయితే కరువు రహిత రాష్ట్రం లక్ష్యాన్ని అంతత్వరగా చేసుకుంటామని ఏకరువు పెట్టనున్నారు. 2018 కల్లా మొదటి దశ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం స్పందించిన తీరు, అందిస్తున్న సాయం ఆశాజనకంగా లేదన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళతారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి విపత్తులు, దానివల్ల జరిగిన నష్టం, బాధితులకు అందించిన సహాయ సహకారాల గురించి వివరిస్తారు. కేంద్రం నుంచి మరింత సాయం కావాలని కోరనున్నారు.
ప్రత్యేక హోదా, 2014-15 రెవెన్యూ లోటు భర్తీ, అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాయలసీమ, ఉత్తరంధ్రల అభివద్ధికి తోడ్పాటు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10, 13లోని కార్పోరేషన్ల, సంస్థల విభజన, నియోజకవర్గాల విభజన, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఎఫ్ఆర్బీఎం పరిధి పెంపు, షెడ్యూల్ 13 విద్యా సంస్థలకు నిధులు, రాష్ట్రంలో కొత్త కేంద్ర సంస్థల ఏర్పాటు తదితరాలపై చర్చించనున్నారు.
వైపరీత్యాల సమయంలో కేంద్ర సాయం ఏమీ పెద్దగా ఉండటం లేదని, 2015లో రూ.2వేల కోట్లు అడిగితే కేంద్రం రూ.433 కోట్లు మంజూరు చేసిందని, ఇచ్చింది రూ.315 కోట్లు మాత్రమేనని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
వరదలు, వర్షాల వల్ల రూ.5129 కోట్ల నష్టం వాటిల్లిందని, పునరావాసం కోసం రూ.1115 కోట్లు, శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.2,386 కోట్లు అడిగితే రూ.280 కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదంటున్నారు.












Click it and Unblock the Notifications