తెలంగాణతో గొడవలు పెట్టుకోం: బాబు, సభలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తెలంగాణపై కఠిన వైఖరి ప్రదర్శించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాస్తంత మెత్తబడినట్లే కనిపించారు. తెలంగాణతో గొడవలు పెట్టుకోవడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. సభలో విద్యుత్ చార్జీల పెంపుపై సమాధానం చెబుతూ హిందుజా, కృష్ణపట్నం నుంచి తెలంగాణకు విద్యుత్ ఇవ్వాల్సి వస్తే, తప్పకుండా ఇస్తామని, వినియోగం ఆధారంగానే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
విభజన తర్వాత రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మరోసారి బాబు విన్నవించారు. 2008లో యూపీఏ హామీలిచ్చి విస్మరించిందని, ఇప్పుడు ఎన్డీయే తన హామీలను నేరవేర్చాలని కోరారు.

అసెంబ్లీలో సందర్భాన్ని బట్టి అధికార, ప్రతిపక్ష సభ్యులపై చలోక్తులు వేసి సభలో నవ్వులు పూయించే బీజేపీఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు ఈరోజు కూడా తనదైన శైలిలో శాసనసభలో నవ్వులు పూయించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచ వాకౌట్ చేయడంతో గత రెండు రోజులుగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయిందని, ఆ సభ ఉప్పూకారం లేకుండా చప్పగా సాగిందని అనడంతో సభలో నవ్వులజల్లు కురిసింది.
విద్యుత్ చార్జీల పెంపుపై చర్చించడానికి ప్రతిపక్ష సభ్యులు సభకు హాజరవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం విద్యుత్‌చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రతిపక్షనేత జగన్ ఇరవై నిమిషాలు కూడా మాట్లాడలేక పోయారని విమర్శించగా, అందుకు విష్ణుకుమార్‌రాజు అభ్యంతరం తెలిపారు.












Click it and Unblock the Notifications