ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్-ఉచిత గ్యాస్ సిలెండర్ల బుకింగ్స్ అప్పటి నుంచే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గతంలో ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలు ఇచ్చారు. వీటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో హామీ అమలుకు సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం చంద్రబాబు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలకు దీపావళి కానుకగా ఈ హామీ అమలు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని....దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సిఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ పౌరసరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్, చమురు సంస్ధల ప్రతినిధులతో ఈ పథకం అమలుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామి సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఈనెల 31వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలన్నారు.
గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851లుగా ఉందని అధికారులు తెలిపారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications