బెజవాడలో ఇష్టం లేకుంటే వెళ్లిపోండి, అణిచివేస్తా, హైదరాబాద్‌లో అలాగే చేశా: బాబు
పిల్లలకు ఎంత సంస్కారం నేర్పించామనేది చాలా ముఖ్య విషయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం జరిగింది.
అమరావతి: పిల్లలకు ఎంత సంస్కారం నేర్పించామనేది చాలా ముఖ్య విషయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడారు. అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా అవార్డు పురస్కారాలు ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టానన్నారు.

ఎన్ని ఆస్తులిచ్చామని కాదు, సంస్కారం, చదువు కావాలి
తాను ఒకటే నమ్ముతానని, రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుందని, ఈ విషయాన్ని తాను ఇప్పుడు చెప్పడం లేదని, 20 సంవత్సరాలుగా చెబుతున్నానని, మన పిల్లలకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదని, మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తామనేది ముఖ్యమన్నారు. చదువు తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుందన్నారు. అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ రోజున మనం ఆనందంగా ఉండాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మన సంప్రదాయాలని, మన కుటుంబ వ్యవస్థను, అదే మాదిరిగా మనకున్న విలువలను మనం కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని, పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారన్నారు.
Recommended Video


నేను ఐటీని ప్రమోట్ చేశాక మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారు
తాను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చానని, ఆరోజు ఓ నిర్ణయం తీసుకున్నానని, ప్రతి ఒక్క కి.మీ. దూరంలో ఎలిమెంటరీ స్కూల్, మూడు కి.మీ. దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ , ఐదు కి.మీ. దూరంలో హైస్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, అదే విధంగా రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రయత్నం చేశానని చంద్రబాబు చెప్పారు. అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలను ప్రమోట్ చేశానని చెప్పారు. ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన తర్వాత మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారని, ప్రపంచంలో 25 శాతం ఐటీ ఇంజనీర్లు మన వాళ్లు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజున నేను వేసిన విత్తనమే అన్నారు. అదే సమయంలోమరో ఆలోచన చేశానని, ఉద్యోగాలతో తృప్తిపడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆరోజున ఓ మెస్సేజ్ ఇచ్చానని చెప్పారు.

కట్నం ఎదురిచ్చి పెళ్లి చేసుకునే రోజులు
విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు స్పందించారు. ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదన్నారు. విద్య, వైద్య ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమ్మాయిలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు రానున్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో పిల్లలపై చదువు ఒత్తిడి పెరుగుతోందని, పిల్లలపై ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.

బెజవాడలో ఉండటం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి
శనివారం చంద్రబాబు విజయవాడలో అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలో కొందరు రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా అణచివేస్తామన్నారు. హైదరాబాద్‌లో అలాగే చేశానన్నారు. విజయవాడలో ఉండటం ఇష్టం లేకపోతే వేరే చోటుకి వెళ్లి బతకాలని, ఇక్కడ ఉండి రౌడీయిజం చేద్దామనుకుంటే మాత్రం రాష్ట్రంలోనే లేకుండా చేస్తామన్నారు.

అందుకే విశాఖ అభివృద్ధి చెందుతోంది, ఊరుకునేది లేదు
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ఇక్కడి ప్రజల ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుందని చంద్రబాబు అన్నారు. విశాఖ ప్రజలు సౌమ్యంగా ఉంటూ, అందరితో కలసిపోతారు కాబట్టే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. కొందరి వల్ల రాజధానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే సహించేది లేదన్నారు. అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠినంగా వ్యవహరించాలని నగర పోలీసు కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications