టీడీపీ నేతలు ఎగిరి గంతేసే వార్త చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన ఏపీ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టడంతో పాటు, మరోవైపు పార్టీ పైన కూడా ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నేతలకు గుర్తింపు ఉంటుంది: చంద్రబాబు
పార్టీ కోసం కష్టపడిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, మొన్నటి ఎన్నికలను సవాల్ గా తీసుకొని కార్యకర్తలు, టీడీపీ నేతలు పార్టీని విజయ తీరానికి చేర్చారని కొనియాడారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నేతలకు గుర్తింపు ఉంటుందని శుభవార్తను ఆయన చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు సేకరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

వారికి టీడీపీలో స్థానం లేదు
కార్యకర్తలే పార్టీకి బలమని టిడిపి కార్యకర్తలకు కూడా తప్పనిసరిగా గౌరవాన్ని ఇస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమాలు చేసే వారికి తెలుగుదేశం పార్టీలో స్థానం ఉండదని, ప్రత్యర్థి పార్టీలలో ఉన్న అటువంటి నేతలను టిడిపిలోకి తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు
ఇక బీసీ నేతలను పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్ గా ఎంపిక చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్ట్ లతో పాటు ఇతర మార్గాలలో రిపోర్టులు తెప్పించి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లపాటు బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, యువగళం, రా కదలిరా, ప్రజాగళం వంటి కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నామని గుర్తు చేశారు.
బాధ్యతతో పని చెయ్యాలన్న చంద్రబాబు
ప్రాజెక్టులను పరిశీలించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాం అని పేర్కొన్న చంద్రబాబు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ నేతలు మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.












Click it and Unblock the Notifications