రేవంత్ రెడ్డికి అవగాహన లేదు! విజయ్ జాతకం తేల్చేసిన చంద్రబాబు
"మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకోవడం ద్వారా విపక్షాలు ఏం సాధించాయి? కేంద్రాన్ని ఓడించామని సంబరపడుతున్న రాహుల్ గాంధీ, స్టాలిన్.. నిజానికి మహిళలనే ఓడించారు" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ వల్ల ఎలాంటి నష్టం లేదని, అవగాహన లేని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని, దాని అమలు ప్రక్రియను అడ్డుకోవడం విపక్షాల అవివేకమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెంచి, అందులో మహిళలకు 33 శాతం కేటాయించడం అత్యుత్తమ ఫార్ములా అని ఆయన అభిప్రాయపడ్డారు. "దీనికన్నా మంచి ఆప్షన్ మరొకటి ఉంటుందా? రేవంత్ రెడ్డి, స్టాలిన్ వంటి నాయకులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను దక్షిణాది రాష్ట్రాల పక్షపాతిగానే చెబుతున్నాను.. ఈ బిల్లు వల్ల మహిళలకు, పురుషులకు ఎవరికీ నష్టం లేదు" అని స్పష్టం చేశారు.

అభివృద్ధికి కేరాఫ్ 'డబుల్ ఇంజన్' సర్కార్..
తమిళనాడుకు ఘనమైన వారసత్వం, సంపద ఉన్నప్పటికీ డీఎంకే పాలనలో అభివృద్ధి కుంటుపడిందని బాబు విమర్శించారు. శాంతిభద్రతల క్షీణత, డ్రగ్స్ విచ్చలవిడితనం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు, చెన్నై-బెంగళూరు-అమరావతి హైస్పీడ్ రైలు కారిడార్‌కు పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. గూగుల్ వంటి సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్ ఈ గడ్డ వాడేనని, తమిళ యువతకు అలాంటి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
నదుల అనుసంధానమే లక్ష్యం.. భాషా సెంటిమెంట్లు వద్దు!
కావేరి నది నీటి వివాదంపై స్పందిస్తూ.. నదుల అనుసంధానమే అన్ని సమస్యలకు పరిష్కారమని చంద్రబాబు అన్నారు. "ఏపీలో కృష్ణా-గోదావరి అనుసంధానం చేశాం. త్వరలో గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రాలకు నీటి భద్రత లభిస్తుంది" అని తెలిపారు. అలాగే, మాతృభాషను గౌరవించుకుంటూనే ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల అభివృద్ధి సాధ్యమని, కేవలం మోదీపై వ్యతిరేకతతో భాషాపరమైన విభేదాలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఏపీలో గత ప్రభుత్వం ఇంగ్లీష్‌ను బలవంతంగా రుద్దాలని చూస్తే కేంద్రమే అడ్డుకుందని గుర్తుచేశారు.
విజయ్ ఎంట్రీపై స్పందన
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నటుడు విజయ్ గురించి ప్రస్తావిస్తూ.. "ఆయన ఏ మేరకు రాణించగలరో ఇప్పుడే చెప్పలేం, కాలమే నిర్ణయించాలి" అని వ్యాఖ్యానించారు. మొత్తానికి, అభివృద్ధి సాధిస్తేనే సంపద సృష్టి జరుగుతుందని, సంక్షేమం సాధ్యమవుతుందని.. అందుకు ఎన్డీయే మద్దతు అవసరమని చంద్రబాబు ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications