వారికి పేదలను ఆదుకునేందుకు మనసు రాదు.. బలవంతం చేయొద్దన్న సీఎం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్) కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పీ-4 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనను లక్ష్యంగా తీసుకుని బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అలానే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందంగా జరగాలని, ఎక్కడా బలవంతం ఉండకూడదని స్పష్టం చేశారు. మార్గదర్శుల నుంచి పేద కుటుంబాలకు చిన్న సహాయం కూడా "కొండంత అండ"గా మారుతుందని చెప్పారు.

"బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగాలతో కూడిన బంధం, చేయూత మాత్రమేనని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలే తమ ఆస్తి అని.. 'జీరో పావర్టీ మిషన్'ను ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎస్‌ఆర్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత వంటి సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని వివరించారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9,37,913 బంగారు కుటుంబాలను గుర్తించగా.. 1,03,938 మందిని మార్గదర్శులుగా ఎంపిక చేశారన్నారు చంద్రబాబు. పీ-4 మిషన్ కింద 10 లక్షల కుటుంబాల అవసరాలను 11 ప్రశ్నల ఆధారంగా ఏఐ (AI) సాయంతో విశ్లేషించారని స్పష్టం చేశారు. అందులో 31% మందికి ఉద్యోగ అవకాశాలు, 22% మందికి వైద్య చికిత్స, 9% మందికి చిన్న వ్యాపారాల విస్తరణ అవసరమని తేలిందన్నారు.
గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునే పథకానికి అనేక మంది ముందుకొస్తున్నారని.. తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నానని సీఎం వివరించారు.
పీ4.. "మార్గదర్శి" అంటే కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే చేసేది కాదు, మంచి మనసుతో మానవత్వం ఉన్నా చాలు అని నిరూపించారు, పారిశుధ్య కార్మికురాలు హేమలత గారు.
— Telugu Desam Party (@JaiTDP) August 5, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె తీసుకున్న నిర్ణయం, ఎంతో మందికి ఆదర్శం అయ్యింది.#P4Model… pic.twitter.com/ywBYZqfSU1
అంతే కాకుండా కొన్ని మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు ప్రయోగాలు చేస్తారని సీఎం విమర్శించారు. కొందరికి డబ్బు ఉండి కూడా సేవ చేయడానికే మనసు ఉండదని కామెంట్స్ చేశారు. మరికొందరికి మనసున్నా సమయం ఉండదని.. అలాంటి వారిని గుర్తించి మార్గదర్శులుగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
నేడు బంగారు కుటుంబంలో సహాయం పొందినవారే రేపు మార్గదర్శులుగా మారే అవకాశముందని సీఎం చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతోపాటు పీ-4 ద్వారా అదనపు చేయూత అందుతుందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications