గొడవలొద్దు.. అలా చేద్దాం..! రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఆఫర్..!
ఏపీలోని రాయలసీమలో నదుల అనుసంధానంలో భాగంగా నిర్మిస్తున్న బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ విషయంలో చంద్రబాబుతో పోరాటనికి అయినా సై అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో విపక్షాలు చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారంటూ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సముద్రంలోకి కలిసిపోయే మిగులు జలాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసే నీటి వాడకం విషయంలో సమస్యలు సృష్టించడం ఎంత వరకూ సమంజసమని రేవంత్ ను ప్రశ్నించారు. ఇప్పటికే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, ఆ మాటకొస్తే పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులేవీ అనుమతులు లేనివే అన్నారు.

అలాగే మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం అంటూ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు.అయినా తాను తెలంగాణపై ఎప్పుడైనా గొడవపడ్డానా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో అసలే తక్కువగా ఉన్న నీటిపై గొడవలు పడితే లాభం లేదని రేవంత్ కు స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దామని రేవంత్ కు ఆఫర్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందామని కూడా ఆఫర్ చేశారు. అంతే కానీ ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదన్నారు.

కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాగే కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయని, కొత్త ట్రైబ్యునల్ ఎలా కేటాయిస్తూ అలా నీళ్లు తీసుకుందామని ప్రతిపాదించారు. మరోవైపు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదని కూడా రేవంత్ కు చంద్రబాబు గుర్తుచేశారు. కాబట్టి బనకచర్లకు అభ్యంతరాలు చెప్పొద్దని పరోక్షంగా ఆయన్ను కోరారు.












Click it and Unblock the Notifications