తొలి ఎమ్మెల్సీని ప్రకటించిన జగన్: ఫిరాయింపులను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!
ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తొలి ఎమ్మెల్సీని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తాను నలుగురు ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా బరిలోకి దించామని..అందులో నలుగురు గెలవగా.. ఒకరు ఓడిపోయారని గుర్తు చేసిన జగన్..తాము ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. ఇక, ఫిరాయింపులను గుర్తు చేసిన జగన్ ఫలితాల గురించి వివరిస్తూ దేవుడి స్క్రిప్టు అంటూ వివరించారు.
తొలి ఎమ్మెల్సీ ప్రకటన..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ తరపున తొలి ఎమ్మెల్సీ అభ్యర్దిని ప్రకటించారు. గుంటూరులో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో తాము అయిదు గురు ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యేగా సీట్లు ఇచ్చామని..అందులో గెలిచిన నలుగురుని పరిచయం చేస్తూ అయిదో వ్యక్తి ఓడిపోయారని చెప్పుకొచ్చారు. గెలిచిన వారిలో కడప, కర్నూలు, గుంటూరు తూర్పు, మదనపల్లి నుండి అంజద్ బాషా, అబ్దుల్ హఫీజ్ ఖాన్ ,మమ్మద్ ముస్తఫా , నవాజ్ భాషా ఉన్నారు. కాగా, అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి పోటీ చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడారు. దీంతో..ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అయిదుగురికి గుర్తింపు ఇస్తామని ఇఫ్తార్ వేదికగా జగన్ ప్రకటించారు. అయితే, ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో పాటుగా మంత్రి పదవి సైతం వరించే అవకాశం ఉందని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఫిరాయింపులను గుర్తు చేస్తూ..
జగన్ దేవుడి గురించి చెబుతూ..గతంలో టీడీపీ తమ ఎమ్మెల్యేలను..ఎంపీలను ఏ రకంగా ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులు చేసిందో వివరించారు. అప్పుడు వైసీపీ నుండి అక్రమంగా 23 మంది ఎమ్మెల్యేలను..ముగ్గురు ఎంపీలను టీడీపీ తమ వైపు తిప్పుకుందని..దేవుడి స్క్రిప్టు ప్రకారం అదే రివర్స్ అయిందని చెబుతూ..టీడీపీ ఈ ఎన్నికల్లో సరిగ్గా ఆ 23 స్థానాలనే గెలుచుకుందని..ఆ ముగ్గురు ఎంపీలనే దక్కించుకుందని వివిరంచారు. సరిగ్గా ఆ ఫలితాలు సైతం పవిత్ర రంజాన్ మాసంలో 23వ తేదీనే వచ్చాయని గుర్తు చేసారు. అయితే ఫిరాయింపులకు పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోకుండా నాటి స్పీకర్ వ్యవహరించారని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications