సర్కార్ వారి ప్లాట్లు తక్కువ ధరలకే; జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం జగన్ చెప్పిందిదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంగళవారం నాడు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల వెబ్సైట్ మరియు లే అవుట్లను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని వెల్లడించారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ద్వారా మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుంది : సీఎం జగన్
ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్న ఆయన, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ద్వారా మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని వెల్లడించారు. ఇక జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను ఎంచుకునే వీలుందని ఆయన వెల్లడించారు.

3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ.. నాలుగు వాయిదాలలో చెల్లింపుకు అవకాశం
ప్రభుత్వమే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుందని వెల్లడించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని విధంగా ప్లాట్లు ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ వేళ దీనికి శ్రీకారం చూడుతున్నామని.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ ఉంటుందని తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఫ్లాట్ల ధరను నాలుగు వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ప్లాట్ల నిర్ణీత విలువలో మొదట 10శాతం చెల్లించాలని పేర్కొన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నతర్వాత 30 శాతం, ఆరు నెలల్లోపు 30శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతాది 12 నెలల్లోగా లేదా రిజిస్ట్రేషన్ తేదీలోగా చెల్లించాలని వెల్లడించారు.

మొదటి దశలో ప్లాట్లు కేటాయించేది ఇక్కడే ,.. నేటి నుండే దరఖాస్తుల స్వీకరణ
తొలిదశలో మంగళగిరి, ధర్మవరం, రాయచోటి, కావలి, కందుకూరు, ఏలూరులలో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ జగనన్న టౌన్ షిప్ ల ఏర్పాటు జరుగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. 18 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. నేటి నుండి https://migapdtcp.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్లను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్.
Recommended Video

మొదటి దశలో 3,894 ఫ్లాట్లు సిద్ధం .. మార్కెట్ ధర కంటే తక్కువకే
పట్టణ ప్రణాళిక విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని, 60 అడుగుల బిటి రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో బ్యాంకులకు, వాణిజ్య సముదాయాలకు కూడా స్థలం కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. మొత్తం మొదటి దశలో 3,894 ఫ్లాట్లను విక్రయించనున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ ప్లాట్ల ధరలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగతావారు కూడా విపరీతంగా ధరలని పెంచి చెప్పే అవకాశం ఉండదని అంటున్నారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications