సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీర్పు వెలువరించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అయితే కోర్టు కచ్చితంగా హాజరు కావాలి అని ఆదేశిస్తే మాత్రం హాజరు కావాలని స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసుల్లో న్యాయస్థానం ఎదుట తాను వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపునివ్వాలంటూ మొదట సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సీబీఐ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన క్లైంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, ప్రతిరోజు విచారణకు హాజరవడంవల్ల పరిపాలనకు ఆటంకం కలుగుతుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, దీంతో సాక్షులను మరింత ప్రభావం చేసే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది వాదించారు. గత డిసెంబరులో ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత రిజర్వు చేసిన తీర్పును వెలువరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించడంతో జగన్మోహన్‌రెడ్డి తరఫున కేసులు వాదిస్తున్న రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో రోజువారీ విచారణ ప్రారంభమైతే ముఖ్యమంత్రి హోదాలో నిత్యం విచారణకు హాజరవడం కష్టసాధ్యమయ్యేది. పరిపాలనా పరంగా విధులకు ఆటంకం కలిగేది. ఇప్పుడు ఈ ఆటంకాలను తెలంగాణ హైకోర్టు తొలగించింది.












Click it and Unblock the Notifications