YS Jagan : రేపు కొడాలి నాని అడ్డాలో సీఎం జగన్ పర్యటన-వివరాలివే..
ఏపీలో వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో రేపు సీఎం జగన్ పర్యటించబోతున్నారు. స్ధానికంగా ఏర్పాటు చేసిన ఓ కీలక కార్యక్రమం కోసం ఆయన గుడివాడ వస్తున్నారు. కొడాలి నాని మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్ధాయిలో దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను ఓ కీలక కార్యక్రమం కోసం నియోజకవర్గానికి రప్పిస్తున్నారు.
రేపు సీఎం శ్రీ వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించబోతున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని జగన్ ప్రారంభించబోతున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని సీఎంవో ప్రకటించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఇందులో ఎన్నికలకు ముందు కీలకమైన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం, బహిరంగ సభ ప్రధానం కానున్నాయి.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం వైఎస్ జగన్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ఇప్పటికే నాలుగుసార్లు గుడివాడ నుంచి విజయాలు సాధించిన కొడాలి నాని.. ఇక్కడి నుంచి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి గెలుపుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్న నాని.. అభివృద్ధి పనుల్ని కూడా వేగవంతం చేయగలిగితే ఇక తనకు మరోసారి తిరుగుండదని భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రితో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications