ఆ వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వానికి కేటాయించండి: ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
అమరావతి: వ్యాక్సిన్ కేటాయింపుల ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని, ఈ వ్యాక్సిన్లు ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించారని, ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని లేఖలో తలిపారు. జులై నెలలో ప్రైవేట్ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదని వివరించారు.

ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. జూన్ 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
కాగా, ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పటి వరకు 29.7 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వగా, 1.5 కోట్ల మంది తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు.
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,231 మంది నమూనాలను పరీక్షించగా 3,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సోమవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 41 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,671కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,757 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 18, 32, 971కు చేరింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 40,074 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,18,95,922 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications