ఎపిలో రుణమాఫీ: రైతు సాధికారితా కార్పోరేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీపై ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సాధికార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ సంస్థ ద్వారానే రైతు, డ్వాక్రా రుణాల మాఫీ జరుగనుంది. రూ. కోటి మూల నిధితో సంస్థను ఏర్పాటు చేశారు. రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు కమిటీకి మళ్లించారు.
కమిటీ సభ్యులుగా ఐదుగురు ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ అనుంబంద రంగాల ముఖ్యకార్యదర్శులు, నోడల్ ఆఫీసర్‌గా వ్యవసాయశాఖ కమిషనర్ వ్యవహరించనున్నారు. ఈనెల 22 నుంచి విజయవాడ కేంద్రంగా కమిటీ చేయనుంది.

ఇదిలావుంటే, దీపావళి కానుకగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని అంగరలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మా వూరు కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారిత కార్పోరేషన్ గురించి కూడా మాట్లాడారు.
రుణమాఫీలో 20 శాతం బ్యాంకర్లకు చెల్లిస్తామని తెలిపారు. రైతు సాధికార సంస్థకు వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించనున్నట్లు బాబు చెప్పారు. రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తామన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేశామని సీఎం వెల్లడించారు. వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులు ఇస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో చాలా మంది కుంటుంబాలకు తిండి లేదని, ఉద్యోగులకు జీతాల మాదిరిగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఇవ్వడంపై ఆలోచిస్తున్నామన్నారు. అనర్హులకు పెన్షన్లు ఇచ్చి అర్హులకు అన్యాయం చేయబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications