ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవాళ మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు సంబంధించి ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన ఉద్యోగులకు ఇలా వన్ టైమ్ ఆఫర్ గా పెన్షన్ పథకం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే చెప్పిన ప్రభుత్వం .. ఇవాళ దీనిపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే ఉద్యోగ నియామక ప్రకటన విడుదలై, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులైన, ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే గతంలో జూలై 13న జారీ చేసిన జీవోఎంఎంస్ నంబర్ 53లో పేర్కొన్న అర్హత నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అర్హులైన, సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

సీపీఎస్ నుంచి ఓపీఎస్ లోకి మారేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు నిధి పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నిధి అప్లికేషన్ లో ప్రత్యేకంగా సీపీఎస్-ఓపీఎస్ కన్ర్షన్ పేరుతో ఆప్షన్ అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు త పాత నిధి లాగిన్ వివరాలతోనే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులు, వీఆర్ఎస్ తీసుకున్న వారు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, సాంకేతికంగా రాజీనామా చేసిన ఉద్యోగులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునేందుకు ఉద్యోగులు తాము ముందుగా నియమితులైన శాఖలోని ఇనిషియల్ అపాయింటింగ్ అథారిటీ (ఐఏఏ)ని సంప్రదించి నాలుగు పత్రాల సర్టిఫైడ్ కాపీలు పొందాలి. ఇందులో ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదా ప్రకటన, అలాగే రిక్రూట్ మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన సెలెక్షన్ లిస్ట్, ఉద్యోగ నియామకానికి సంబంధించిన అపాయింట్ మెంట్ ఆర్డర్లు, అలాగే విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఉండాలి. ఈ పత్రాలకు దరఖాస్తు అందిన 15 వర్కింగ్ డేస్ లో సంబంధిత అధికారులు కాపీలు జారీ చేయాలి. వీటిని తీసుకున్నాక ఉద్యోగులు నిధి పోర్టల్ లో అప్ లోడ్ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసులోని డీడీఓకు దరఖాస్తు చేసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిగా పనిచేసిన ఆఫీసు డీడీఓకు సమర్పించాలి. అనంతరం డీడీఓలు ఇనిషియల్ అపాయింటింగ్ అథారిటీకి పంపుతారు. దాన్ని వారు ఏడు రోజుల్లోగా నిర్ధారించాలి. తర్వాత డీడీఓలు పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం హెడ్ ఆఫ్ ఆఫీస్ ప్రతిపాదనలు సంబంధిత పీఏఓ లేదా డీటీఏకు పంపుతారు. చివరిగా అర్హతలు పరిశీలించి కాంపిటెంట్ అథారిటీ తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది.
ఇలా సీపీఎస్ నుంచి ఓపీఎస్ లోకి మారేందుకు అనుమతి పొందిన ఉద్యోగుల విషయంలో సీపీఎస్ ఖాతాలోని ఉద్యోగి వాటా, ప్రభుత్వ వాటా, పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాల్ని నిబంధనల ప్రకారం సర్దుబాటు చేస్తారు. సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల వాటాను జీపీఎఫ్ కు జమ చేస్తారు. అలాగే ఉద్యోగి వాటాపై నిబంధనల ప్రకారం వడ్డీ లెక్కిస్తారు. ప్రభుత్వవాటాను ప్రభుత్వ ఖాతాలోకి జమ చేస్తారు. పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్దేశిత ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. ఉద్యోగులు తమ మొత్తం సీపీఎస్ కార్పస్ ను నగదు రూపంలో పొందే హక్కు ఉండదు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ వాటా, దానిపై రాబడి తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ ప్రక్రియ తర్వాతే ఓపీఎస్ కు మార్పు జరుగుతుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందని ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వ వాటా జమ చేసుకుని ఉద్యోగి వాటా, రాబడిని వారికి చెల్లిస్తారు. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31లోగా ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications
