Ind vs NZ 3rd ODI: న్యూజీలాండ్ తో మూడో వన్డేకు 2 కీలక మార్పులు- వాళ్లిద్దరూ రిటర్న్?
భారత్-న్యూజీలాండ్ వన్డే సిరీస్ లో భాగంగా రేపు హ్యామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ లో మూడో మ్యాచ్ (IND vs NZ 3rd ODI) జరగనుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో వన్డే కోసం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా తొలి రెండు వన్డేల్లో గెలిచినా, ఆటగాళ్లు ఆశించిన స్దాయిలే రాణించలేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో కివీస్ తో మూడో మ్యాచ్ కు జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
కివీస్ తో మూడో వన్డేకు సిరీస్ లో అందుబాటులో ఉన్న నలుగురు పేసర్లలో ఒకరికి విశ్రాంతి నివ్వాలని భావిస్తుండటంతో ఆ మేరకు ఓ మార్పు జరగనుంది. అలాగే స్పిన్ విభాగంలోనూ ఓ మార్పు చేయాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. కివీస్ తో జరిగిన రెండో వన్డేలో పేస్ విభాగానికి నాయకత్వం వహించిన అర్ష్ దీప్ సింగ్ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. దీంతో అతని స్ధానంలో తొలి రెండు వన్డేల్లో పెవిలియన్ కే పరిమితమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీసినా 70 పరుగులు సమర్పించుకున్న అర్ష్ దీప్ కు మూడో మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చి సిరాజ్ ను ఆడించేందుకు మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే స్పిన్ విభాగంలో కూడా ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ కు ఎంపికైనా ఇప్పటివరకూ అవకాశం దక్కని లెఫ్ట్ ఆర్మ చైనమన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు మూడో వన్డేలో అవకాశం దక్కేలా కనిపిస్తోంది. కివీస్ పై మంచి ట్రాక్ రికార్డు ఉన్న కుల్దీప్ ఈ టూర్ లో మాత్రం ఇండియా ఏడు మ్యాచ్ లు ఆడినా అవకాశం దక్కలేదు. దీంతో కుల్దీప్ ను ఆడించే అవకాశం ఉంది. అప్పుడు అక్షర్ పెవిలియన్ కు పరిమితం కావచ్చు. మరోవైపు కివీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు వీలుగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ , కేఎల్ రాహుల్ కు ఈ మ్యాచ్ తర్వాత తప్పుకుంటారు. దీంతో తదుపరి వన్డేలకు వీరి స్ధానంలో ప్రత్యామ్నాయాల్ని టీమిండియా సిద్దం చేసుకుంటోంది. కాబట్టి ఈ సిరీస్ లో టీమిండియాలో పలు మార్పులు తప్పేలా లేవు.














Click it and Unblock the Notifications
