NTR సినిమా విడుదల చేయాలంటూ ధర్నాలు, నిరసనలు చేసిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు
తమ అభిమాన హీరో సినిమా విడుదలను అధికారంలో ఉన్న ప్రభుత్వం అడ్డుకోవడంతో ప్రజలే రోడ్లపైకి వచ్చి ఆ సినిమాను విడుదల చేయాలంటూ ధర్నాలు చేయడంతోపాటు, నిరసన ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హోరెత్తించారు. ఈ విషయం ఏ హీరోకు సంబంధించి అంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకు సంబంధించి. అది ఏ సినిమా అంటే.. బొబ్బిలిపులి. వివాదం ఎందుకు జరిగిందనేది తెలుసుకుందాం.
రాజకీయ వ్యవస్థపై విమర్శలు
ఇక ఈ సినిమా థియేటర్ల ముందుకు రావడానికి వెనుక ఒక పెద్ద సంచలనమే జరిగింది. 1982 మార్చిలో ఎన్టీఆర్ "తెలుగుదేశం పార్టీ" స్థాపించిన కొద్ది నెలలకే ఈ సినిమా రావడం, ఇందులో అప్పటి రాజకీయ వ్యవస్థపై ఘాటైన విమర్శలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు ఏకంగా రోడ్లెక్కి నిరాహార దీక్షలు చేశారు. పెద్ద ఎత్తున వివాదం నడవడంతో సెన్సార్ బోర్డు కొన్ని కట్లతో 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. అప్పట్లో 'A' సర్టిఫికేట్ ఉంటే సినిమా ఆడదనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ, ఈ చిత్రం ఏకంగా రూ. 3.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అప్పట్లోనే రికార్డు సృష్టించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడటమే కాకుండా, హైదరాబాద్లో 50 వారాల స్వర్ణోత్సవం జరుపుకుంది.

పవర్ ఫుల్ పొలిటికల్
'బొబ్బిలి పులి' కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, అది అప్పటి రాజకీయ పరిణామాలను మార్చేసిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ టూల్. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి బలీయమైన పునాది వేసిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్పటికీ యూట్యూబ్లో వీక్షించవచ్చు. ఎవర్ గ్రీన్ మెస్సేజ్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చూడాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
సమాజంలోని కుళ్లును నిలదీసింది
తెలుగు సినిమా చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే... కొన్ని చిత్రాలు కేవలం థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలో పెద్ద ఎత్తున చైతన్యాన్ని రగిలిస్తాయి. సరిగ్గా 1982 జూలై 9న విడుదలైన నందమూరి తారక రామారావు, దాసరి నారాయణరావుల 'బొబ్బిలి పులి' అలాంటి ఒక చారిత్రాత్మక సంచలనమే. సామాజిక అక్రమాలపై ఎన్టీఆర్ ఎక్కుపెట్టిన ఈ బాణం, అప్పట్లో తెలుగునాట సృష్టించిన ప్రభంజనం సామాన్యమైనది కాదు.
దర్శకరత్న దాసరి నారాయణరావు రాసిన కథ, మాటలు ఈ చిత్రానికి అసలైన ఊపిరి. దేశభక్తిని, సమాజంలోని కుళ్లును నిలదీసేలా ఆయన అందించిన పవర్ఫుల్ డైలాగులను ఎన్టీఆర్ తన స్వరం ద్వారా అమృతంలా మార్చేశారు. ఇక జె.వి. రాఘవులు అందించిన స్వరాలు ఎవర్ గ్రీన్. ముఖ్యంగా "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" పాట ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీనితో పాటు "తెల్లా తెల్లని చీరలోన", "అది ఒకటో నంబర్ బస్సు" వంటి పాటలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. విజయా మాధవి కంబైన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ దీన్ని తెరకెక్కించారు.














Click it and Unblock the Notifications
