టీడీపీ మహానాడుపై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ప్రశంసలు!
ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా వేదికగా మహానాడు నిర్వహించింది . దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందని టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడు దశ, దిశ నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహానాడులో చర్చించనున్న కీలక అంశాల పైన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.
మహానాడు ఒక చారిత్రక, రాజకీయ వేడుక: పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఒక చారిత్రక, రాజకీయ వేడుక అని, అటువంటి పండుగ వాతావరణంలో నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తరపున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

వారికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి సేవలందిస్తున్న రెండు రాష్ట్రాల అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిన పేరు మహానాడు
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉందని, మహానాడు అనే పదం విన్న, చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ నే అని ఆయన అన్నారు. అంతగా తెలుగు వారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు అని తెలిపారు. మూడు రోజుల పాటు ప్రజాసేవ, ప్రజా ప్రయోజనాల పరమావధిగా జరుపుతున్న ఈ వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ అంశాలపైన మహానాడులో ప్రణాళికలు
యువ గళం, కార్యకర్తే అధినేత, స్త్రీ శక్తి, పేదల ప్రగతి, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ వంటి అంశాల పైన ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక మహానాడు ప్రాంగణం పసుపు వర్ణంతో ముస్తాబై శోభాయమానంగా కనువిందు చేస్తోందని ఆయన అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహానాడు వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications