అసెంబ్లీకి రావొద్దు-ఏపీ మంత్రికి రఘురామ సంచలన రూలింగ్..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఒకరిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ఆదేశాలు ఇచ్చారు. గతంలో అధికార కూటమి చెప్పినా పట్టించుకోకపోవడంతో నేరుగా రఘురామ రంగంలోకి దిగి ఆయన్ను ఉద్దేశించి అసాధారణ రీతిలో రూలింగ్ ఇచ్చారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
విషయానికొస్తే.. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆయన అలాగే అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. దీంతో ఆయన్ను అసెంబ్లీకి రావద్దని మంత్రి లోకేష్, విష్ణుకుమార్ రాజు తదితరులు వారిస్తున్నారు. అయినా ఆయన వినడం లేదు. ఇవాళ కూడా చేతికి కనోలా పెట్టుకుని అసెంబ్లీకి హాజరయ్యారు.

గోరుగల్లు రిజర్వాయర్ పై సమాధానం ఇచ్చి, తన సీట్లో మంత్రి రామానాయుడు కూర్చున్న సందర్భంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న రఘురాం కృష్ణంరాజు మంత్రి నిమ్మల తామరాకు మీద నీటిబొట్టులా సమాధానం చెప్పారని సరదాగా అన్నారు.దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. అన్నకు బాగోలేదు అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అని అడిగారు. అలాగే జ్వరం అని నాకు తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రా వద్దని రూలింగ్ ఇచ్చి తీరాల్సిందే అధ్యక్షా అని అసెంబ్లీలో బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా కోరారు.
దీంతో డిప్యూటీ స్పీకర్ రఘురామ .. మంత్రి నిమ్మల పరిస్ధితిపై ఆరా తీశారు. విషయం తెలిసి వెంటనే స్పందించారు.
డాక్టర్ రామానాయుడు గారు.. మీరు పని రాక్షసుడు.. ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో ఆయన అసెంబ్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications